అదానీ గ్రూప్ సంస్థలకి చైర్మన్, భారత దేశ అపర కుబేరుడు, ప్రపంచంలోనే అంత్యంత సంపన్నత కలిగిన 5వ వ్యక్తి గౌతమ్ అదానీ (Gautam Adani). అలాంటి స్ఫూర్తి దాయకమైన అదానీ గురించి తెలియని వారూ, తెలియాల్సిన వారూ లేరనడం అతిశయోక్తి కాదేమో.
1962, జూన్ 24న జైన్ కుటుంబానికీ చెందిన దుస్తుల వ్యాపార వేత్త శాంతిలాల్ అదానీ, శాంతా బేన్ అదానీలకి జన్మించిన గౌతమ్ అదానీ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించాడు.
చిన్న తనం నుంచి చదువులో బానే రాణిస్తూ వచ్చిన గౌతమ్ అదానీ తన ప్రాథమిక విద్యనంతా అహ్మదాబాద్ లోనే పూర్తి చేసుకున్నాడు. తన కాళ్ళ మీద తను నిలబడాలని కోరుకునే అదానీ ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండే వాడట. అలా ఆయన కోరుకున్న దానిని సాధించడానికి చిన్న అవకాశమైనా దొరకక పోతుందా అని ఎదురు చూస్తుండేవాడట.
గౌతమ్ అదానీ (Gautam Adani) వ్యాపార జీవితం
తన స్కూల్ విద్యను పూర్తి చేసుకున్న అదానీ ఆ తరువాత బ్యాచిలర్స్ డిగ్రీ కోసం గుజరాత్ యూనివర్సిటీలో చేరాడు. అయితే తనంతట తాను వ్యాపారం మొదలు పెట్టాలని ఉండే అదానీ కోరిక కొద్ది కొద్దిగా పెరిగి పెద్దది అవ్వడంతో తను ఆ యూనివర్సిటీలో చేరిన రెండో ఏడాదికే చదువును ఆపేశాడు. అక్కడి విద్యా జీవితానికి వీడ్కోలు చెప్పిన అదానీ తన వ్యాపార జీవితం వైపు తొలి అడుగులు వేయడం మొదలు పెట్టాడు.
అదానీ 1978లో తన లక్ష్యం కోసం ముంబై వెళ్ళి మొదటిగా మోహన్ బ్రదర్స్ దగ్గర ఒక డైమండ్ సార్టర్ గా(Diamond sorter) చేరాడు. ఆ తరువాత ఆయన సోదరుడు మహసుఖ్ బాయి అదానీ 1981లో అహ్మదాబాద్ లో ప్లాస్టిక్స్ సంస్థ ఒకటి స్థాపించి గౌతమ్ అదానీని దాంట్లో మానేజర్ గా ఉండమని కోరడంతో తన సోదరుడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు.
1985లో కొన్ని పాలిమర్లను దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టాడు, 1988 లో చిన్న చిన్న వ్యాపార సంస్థలకు వాటిని అందించడం ప్రారంభించాడు. ఆ విధంగా ఇప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్( Adhani Enterprises) గా పిలువ బడుతున్న అదానీ ఎక్స్‌పోర్ట్ ను(Adhani Exports) స్థాపించాడు.
1996లో 4620MW సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్స్ ని అదానీ పవర్ గా( Adhani power) ప్రారంభించాడు. ఆ సంస్థను స్థాపించిన కొంత కాలంలోనే అది ఇండియాలోనే అత్యధిక పవర్ ని ఉత్పత్తి చేస్తున్న ఏకైక ప్రైవేట్ సంస్థగా ఎదిగి అందర్నీ ఆశ్చర్య పరిచింది.
2020 మే నెలలో 6 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ప్రపంచంలోనే అత్యధిక సోలార్ బిడ్ ని అదానీ సొంతం చేసుకున్నాడు. ఇదే ఏడాది సెప్టెంబర్లో ముంబై నేషనల్ ఎయిర్ పోర్ట్ కి చెందిన 74 శాతం వాటాను చేజిక్కించుకున్నడు.
2022లో ముకేష్ అంబానీని వెనకకు నెట్టేసి ఆసియాలోనే అత్యధిక సంపన్నత కలిగిన వ్యక్తిగా నిలిచాడు. ఇదే ఏడాది ఆగస్ట్ లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నత కలిగిన 3వ కుబేరుడిగా నిలిచి ఫార్చ్యూన్ (fortune) పత్రికకి ఎక్కాడు.
ఇలా ప్రతి దశలో అంచలంచెలుగా ఎదుగుతూ యువ వ్యాపారులకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్న అదానీ,తను ఇంతటితో ఆగనని,ఇంకా చేయాల్సింది చాలా ఉందని అందరికీ తెలియచేస్తూనే ఉన్నాడు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు