India: టీమిండియా ఆసియా కప్ నుండి ఆటగాళ్ల గాయాల వలన చాలా ఇబ్బందులు పడింది. ఈ ఏడాది జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లొచ్చాక బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి గాయంతో బుమ్రా ఆసియా కప్ నుండి ఇండియా టీంకి దూరంగానే ఉన్నాడు. ఇక రవీంద్ర జడేజా ఆసియాకప్ లో పాకిస్తాన్ తో ఆడిన తొలి మ్యాచ్ లో పాల్గొన్న తర్వాత కాలిగాయంతో ఇంటి బాట పట్టాడు. టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లో ఓడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లు వంటి వారు లేకపోవడం. వీరిద్దరు ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
ఈ ఏడాది గాయాల కారణంగా వీళ్లు ఆడింది తక్కువ విశ్రాంతి తీసుకున్నదే ఎక్కువ. టీ20 ప్రపంచకప్ కు ముందు స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ లలో బుమ్రాను బలవంతంగా ఆడించినా టీమ్ మేనేజ్మెంట్ దానికి తగ్గ ఫలితం అనుభవించింది. సరిగ్గా టీ20 ప్రపంచకప్ కు ముందు బుమ్రాకు గాయం తిరగబెట్టడంతో టీమ్‌ని వీడక తప్పలేదు. ఇక రవీంద్ర జడేజా విషయానికొస్తే ఆసియాకప్ లో పాకిస్తాన్ తో ఆడిన తొలి మ్యాచ్ లో పాల్గొన్న జడేజా కాలికి ఆపరేషన్ చేయించుకుని కొన్నాళ్లు ఎన్సీఏలోనే గడిపాడు. టీ20 ప్రపంచకప్ కూ దూరమైన జడేజా.. తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపికై తర్వాత తన భార్య ఎన్నికల కారణంగా తప్పుకున్నాడు.
ఇక రోహిత్ శర్మ ఇటీవల బంగ్లాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అయితే ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు జడేజా, బుమ్రాకూడా మళ్లీ భారత జట్టుతో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు కొద్దిరోజుల పాటు ఎన్సీఏలో ట్రైనింగ్ తీసుకున్న బుమ్రా.. పూర్తి ఫిట్నెస్ సాధించాడట. ఈ ఇద్దరూ జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ పర్యటనలో తుదిజట్టులో ఉంటారని బీసీసీఐ వర్గాల ద్వారా సమాచారం అందతుంది.