Inauguration of new Telangana secretariat news : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్‌గా బహూకరించాలని, ఆయన పుట్టినరోజున ఈనెల 17న ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే, శాసనమండలిలో స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. దీంతో ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 16వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. గురువారమే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.
అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లవుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సెక్రటేరియట్ భవన సముదాయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీఎంవో అధికారులు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంప్రదింపులు జరిపారని, అనంతరం వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వాస్తవానికి ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి సచివాలయ ప్రారంభోత్సవానికి అడ్డంకులు ఉండకూడదు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇక వాయిదా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. తదుపరి ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.
తాజాగా కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడిన నేపథ్యంలో తిరిగి ఉగాదికి లేదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న ప్రారంభించే అవకాశాలను ప్రభుత్వ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత మరో మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ క్రమంలో ఉగాదికి అయితే ఎలాంటి అడ్డంకులు ఉండబోవని అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు.
also read news :
aamir khan : వాక్ స్టిక్ సాయంతో నడుస్తున్న అమీర్ ఖాన్.. ఏమైంది ?
Ileana : ఇలియానా సినిమాలలో కనిపించకపోవడానికి కారణం ఇదా?