Hyderabad : హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్న చలి.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు.. బీ కేర్‌ఫుల్!
TFN
Hyderabad Weather News : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. కొన్నాళ్లుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా.. ప్రస్తుతం మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం చలికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు అధికారులు హెచ్చరికలు చేశారు. రాబోయే కొన్ని రోజులు చలిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాగ్యనగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నగరంలో ప్రస్తుతం 26 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత ఉంది. రేపటి నుంచి ఇది మరింత దిగజారే పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. ఈనెల 26వ తేదీ నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పొగమంచు కప్పేస్తుందని అధికారులు తెలిపారు. రాత్రివేళ, తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారు వీలుంటే వాయిదా వేసుకొని పగటిపూట జర్నీలు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో మంచు దుప్పటి ఉంటుందని ఐఎండీ పేర్కొంది. బయటకు వచ్చే వారు విధిగా స్వెటర్లు ధరించాలని సూచించింది. ఇంట్లో వృద్ధులు, చిన్నారులు ఉంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
మరో మూడు రోజులు గజ గజ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలీ, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో చలి తీవ్రత పెచ్చుమీరుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. మూడు రోజులపాటు చలి తీవ్రత అత్యధికంగా ఉంటుందని తెలిపింది. వేసవి కాలం నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత శంషాబాద్ విమానాశ్రయంలో 6.5 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది.