Palamuru-RangaReddy Project : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పథకంలో తాగునీటి పనులకు ఉద్దేశించిన 7.15 టీఎంసీల ప్రాజెక్టు పనులు నిరభ్యంతరంగా కొనసాగించుకోవాలని సూచించింది. ప్రాజెక్టు పనుల్లో పర్యావరణానికి జరిగిన నష్టానికిగానూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు చెల్లించాల్సిన 528 కోట్ల రూపాయలు, 300 కోట్ల ఫైన్‌పై కూడా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేస్తున్నారని, వాటిని ఆపాలని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వరరెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన రైతులు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆపాలని ఎన్జీటీ 2021 నవంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించకుండా పనులు కొనసాగిస్తున్నారంటూ 2022 డిసెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వానికి పరిహారం, జరిమానా కూడా విధించింది ఎన్జీటీ. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్‌ల ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అవకాశం లభించింది. అయితే, దీని కోసం మరో 15 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం వెనకభాగం నుంచి రోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. ఇందులో ఒకటిన్నర టీఎంసీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు, అర టీఎంసీ డిండి ఎత్తిపోతలకు వాడుకోవాలని ప్రణాళిక రచించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి 35 వేల 200 కోట్ల వ్యయ అంచనాతో పరిపాలన అనుమతి లభించింది. తాజా అంచనా సుమారు 55 వేల కోట్లకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీలతో సహా అనేక రకాల పనులు ఉన్నాయి. ప్రస్తుతం మొదటి దశ కింద పనులు మాత్రమే పూర్తి చేయనున్నారు. ప్రధాన పనులు, భూసేకరణ, పునరావాసానికి ఇప్పటికే సుమారు 23 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు. ఇంకా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 15 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
also read :
Health Benefits of Eating Cloves : లవంగాలు తినడం వల్ల లాభాలు ఇవే..
Chiranjeevi: రామ్ చరణ్‌ని ఆకాశానికి ఎత్తేసిన జేమ్స్ కామెరూన్.. ఫుల్ ఖుష్ అయిన చిరు