floods in Warangal : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి రోడ్లపైకి వరద పోటెత్తుతోంది. ఈ వరదల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని మోరంచవాగు ముంచెత్తింది. ఈ వరదలో నలుగురు గల్లంతయ్యారు. మృతులు ఒడిరెడ్డి, వజ్రమ్మ, నాగరాజు, మహాలక్ష్మిగా గుర్తించారు. వరద కాస్త తగ్గుముఖం పట్టినా.. మృతదేహాలు మాత్రం ఇంకా లభ్యం కాలేదు.
ములుగు జిల్లాలో జంపన్నవాగు కొండాయి, మల్యాల గ్రామాలను ముంచెత్తింది. గ్రామంలోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన 20 మందిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరి కోసం పడవలు, డ్రోన్ కెమెరాలతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
అయితే గురువారం రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో రషీద్, మజీద్ ఖాన్, అతని భార్య షరీఫ్, అజ్జు మహబూబ్ ఖాన్ ఉన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట శివారు మారేడు గొండ చెరువు పొంగి పొర్లడంతో ఒక్కసారిగా ఊరును ముంచెత్తింది. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరద నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో బండ్ల సారయ్య మృతదేహం లభ్యమైంది. సారమ్మ, రాజమ్మ ఇద్దరు వరదలో కొట్టుకు పోయారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
మరోవైపు మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన శ్రీను, యాకయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ముత్తడి వరదల్లో గల్లంతయ్యారు.. శ్రీను మృతదేహం లభ్యం కాగా .. యాకయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..
హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వద్ద వరద ఉధృతికి కొండల మహేందర్ కొట్టుకుపోయి మృతి చెందాడు. బైక్‌తోపాటు వరదలో కొట్టుకుపోయిన మహేందర్ మృతదేహం ముళ్లపొదల్లో కూరుకుపోయి కనిపించింది.
హనుమకొండ అమృతా టాకీస్ సమీపంలో ఉదయం పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై వెంటనే మృతి చెందిన ఘటనలో ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు.
మొత్తంగా కుండపోత వర్షాలు, వరదల వల్ల అనూహ్యమైన ప్రాణ నష్టం జరిగింది.
also read :
Red Alert in Telangana : జల దిగ్భంధంలో పలు జిల్లాలు.. మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు..
Trains Cancelled : వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. ఏయే రైళ్ళంటే ?