Employment : 2020 ప్రారంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తితో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉద్యోగాల కోత అన్ని రంగాల్లోనూ కొనసాగుతోంది. దీంతోపాటు ఆటోమేషన్ రంగంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి.
ఉద్యోగాల తీరులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాజాగా ఓ సంచలన నివేదిక వెల్లడించింది. కొత్తగా ఉద్యోగాల సృష్టిలో తగ్గుదల ఉంటుందని స్పష్టం చేస్తోంది ఆ నివేదిక.
రానున్న ఐదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 23 శాతం ఉద్యోగాల్లో మార్పులు కచ్చితంగా ఉంటాయని ప్రపంచ ఆర్థిక నివేదిక పేర్కొంది. 2023 నుంచి 2027 ఏడాది వరకు సుమారు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టి అవుతాయని, అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్ల జాబ్స్ కనిపించవని అంచనా వేశారు.
ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్‌లో ఉద్యోగాల తీరుపై ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023 పేరిట ప్రపంచ ఆర్థిక నివేదిక వెల్లడైంది. వరల్డ్ వైడ్ సుమారు 803 కంపెనీల్లో నిర్వహించిన అంచనా సర్వే ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
భవిష్యత్తులో కొత్త ఉద్యోగాల సృష్టిలో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిలో మందకొడితనం, సరఫరా కొరతలు లాంటివి అవాంతరాలుగా నిలుస్తాయని నివేదికలో అంచనా వేశారు. ఆధునిక సాంకేతికత అమలు, డిజిటలైజేషన్ వల్ల ఉద్యోగాల ప్రక్రియలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయని నివేదిక పేర్కొంది.
ఒకరకంగా చూస్తే ఆధునిక టెక్నాలజీ వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగాల కల్పన బాగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. రానున్న ఐదేళ్లలో వ్యాపారాల్లో మార్పులు టెక్నాలజీపైనే ఆధారపడతాయని పేర్కొంది.
పర్యావరణ, టెక్నాలజీ, ఆర్థికపరంగా వచ్చే కొత్త విధానాలే భవిష్యత్‌లో ఉద్యోగాల సృష్టి, లేదా కోతలను నిర్దేశిస్తాయని నివేదికలో బహిర్గతమైంది. 75 శాతం కంపెనీలు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటాయని నివేదిక తెలిపింది.
కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్‌తో రానున్న ఐదేళ్లలో నికరంగా ఉద్యోగాల కల్పన పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ నిపుణులకు రాబోయే రోజుల్లో గిరాకీ పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
also read :
Shriya Saran : ఇలాంటి ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా?
Agent : వింత వాదన.. లైగర్, ఏజెంట్ చిత్రాలు ఫ్లాప్ కావడానికి కారణాలు ఇవేనట…!