Success Story: సివిల్స్ పరీక్షలంటే చాలా కఠిన ప్రిపరేషన్ అవసరం. కోచింగ్‌కి వెళ్లి కఠోర సాధన చేసి సక్సెస్ అయ్యేవారు వందలాది మంది ఉంటారు. అయితే, కోచింగ్‌కు వెళ్లకుండా కూడా కఠోర సాధన చేసి సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి విజయగాధలు యువతకు స్పూర్తివంతంగా నిలుస్తున్నాయి. ఓ 22 ఏళ్ల యువకుడు.. కోచింగ్ తీసుకోకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో నేషనల్ లెవల్‌లో 149వ ర్యాంకు సాధించాడు.
ఆ యువకుడి విజయగాధలోకి వెళ్తే.. కోచింగ్ తీసుకోకుండానే 149వ ర్యాంకు సాధించి ఆశ్చర్య పరిచిన యువకుడు ఐపీఎస్ కొట్టాడు. అతడే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన ఆదర్శ్ శుక్లా. రాంనగర్ తహసీల్ ఏరియాలోని మద్నా గ్రామ నివాసి అయిన ఆదర్శ్ శుక్లా.. ప్రస్తుతం బారాబంకీలోని మయూర్ విహార్ కాలనీలో ఉంటున్నారు. ఆయన తండ్రి డాక్టర్ రాధాకాంత్ శుక్లా ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన తల్లి గృహిణి.
ఆదర్శ్ శుక్లాకు ఓ సోదరి ఉన్నారు. ఆమె స్నేహా శుక్లా. ఎల్‌ఎల్‌ఎం చేసింది. ఆదర్శ్ మొదటి నుంచి విద్యలో బాగా రాణిస్తుండేవాడు. ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మెరిట్ జాబితాలో ఆరో ప్లేస్ సాధించాడు. ఇంటర్‌లోనూ 90 శాతానికిపైగా మార్కులు పొందాడు. 2018లో ఆదర్శ్ బీఎస్సీలో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. లక్నోలోని నేషనల్ పీజీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు. 2019 నుంచి యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అయ్యాడు.
2020లో కరోనా వ్యాప్తి చెందడంతో యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే ప్రిపేర్ అయిన ఆదర్శ్.. పలుమార్లు డిప్రెషన్ కి గురయ్యేవాడు. అయితే, మొక్కవోని లక్ష్యంతో ప్రయత్నించేవాడినని చెప్పాడు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు క్రికెట్ ఆడుతూ, రోజూ 8 నుంచి 10 గంటలపాటు చదువుకున్నానని ఆయన చెప్పాడు.
తన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా పరిమితంగా ఉంటుందని ఆయన తెలిపాడు. యువత తమను తాము ఎప్పుడూ తక్కువగా భావించరాదని, ఏదైనా కష్టపడి పని చేయాలని ఆదర్శ శుక్లా పిలుపునిచ్చాడు. జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించే ప్రయత్నంలో మీ ఏకాగ్రతను వదులుకోవద్దని చెప్పాడు.
Read Also : Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?