దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi Airport) కొద్ది రోజులుగా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విమాన ప్రయాణికులు భారీగా పెరగడంతోపాటు రద్దీకి అనుగుణంగా సిబ్బంది, యంత్రాలు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. సెక్యూరిటీ తనిఖీలకు చాలా సమయం పడుతుండడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులో పడిగాపులు పడాల్సి వస్తోంది. పౌర విమానయాన సంస్థ తక్షణ చర్యలు తీసుకుంటున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది.
భారీ రద్దీ కారణంగా దేశీయంగా ప్రయాణించే వారు మూడున్నర గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచిస్తున్నాయి. ప్రస్తుతం బుధవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త సద్దుమణిగిందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ట్విట్టర్ వేదికగా పేర్కొంది. చెకింగ్ సమయం 5 నిమిషాల్లోపే ఉందని తెలిపింది. రద్దీని ఎదుర్కొనడానికి అనేక చర్యలు చేపట్టినట్లు వివరించింది. అదనపు ఎక్స్‌రే యంత్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది.
సెక్యూరిటీ తనిఖీలు వేగంగా పూర్తి చేసుకోవాలంటే ప్రయాణికులు కొన్ని సూచనలు పాటించాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి. ప్రయాణికులు తమ వెంట 7 కిలోలకు మించని లగేజీ బ్యాగ్‌తో రావాలని చెబుతున్నాయి. చెకింగ్, బోర్డింగ్ సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ సమయం పడుతోందని, ప్రయాణికులు సహకరిస్తే అనుకున్న సమయానికే తమ గమ్యస్థానాలకు చేరుతారని సూచిస్తున్నాయి. డిజి యాత్ర యాప్‌ను ఉపయోగించడం వల్ల త్వరగా చెకింగ్ కంప్లీట్ అవుతుందని విమానయాన సంస్థలు కోరాయి.
చేపల మార్కెట్ కంటే దారుణంగా..
ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణికులు భారీగా వస్తుండడంతో చేపల మార్కెట్‌ను తలపిస్తోందని చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ బాధను చెప్పుకుంటున్నారు. ఇక్కడి రద్దీని వీడియోలు, ఫొటోలు తీస్తూ షేర్ చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొన్ని రోజులుగా భారీ రద్దీ ఏర్పడడంతో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం విమానాశ్రయాన్ని ఆకస్మికంగా పర్యటించారు. ప్రయాణికుల ఇక్కట్లను తెలుసుకున్నారు. రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీని ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రద్దీపై ఉన్నతాధికారులు ఈరోజు అత్యవసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
also read news:
YS Sharmila: షర్మిల పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే.. పాదయాత్రపై మార్గదర్శకాలివే..!
Moral Stories in Telugu : బంగారు ప్రమిద