China: జనాభాలో చైనాను ఇటీవలే ఇండియా దాటేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తమ దేశంలో జనాభాను పెంచేందుకు చైనా ఇప్పుడు కొత్తరకమైన ఆలోచనలు చేస్తోందట. వీలైనంత త్వరగా జనాభాను పెంచేందుకు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 20 నగరాల్లో కొత్తతరం వివాహాలు, సంతానోత్పత్తి సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలను స్టార్ట్ చేసిందట. దేశ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చైనా అధికారులు పేర్కొంటున్నారు.
చైనా ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ సంస్థ వీటిని సిద్ధం చేసినట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు వివాహాలు చేసుకొని పిల్లలను కనేటట్లు ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో వివరించింది. ఈ కొత్త ప్రాజెక్టులో భాగంగా సరైన సమయంలో యువతీ యువకులు వివాహాలు చేసుకొనేలా చూడటం, పిల్లల్ని కనే బాధ్యతను భార్యా భర్తలు పంచుకోవడం, పెళ్లికుమార్తెలకు చెల్లించే అధిక కట్నాలను అరికట్టడం చేస్తారు.
పెళ్లి విషయంలో ఇతర ఆచారాలను కూడా పరిరక్షించడం లాంటివి ఈ ప్రాజెక్టులో భాగంగా చేయనున్నారు. యువతరానికి వివాహం, సంతానంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఈ ప్రాజెక్టు మొదలు పెడుతున్నట్లు డెమోగ్రాఫర్ హెయాఫు గ్లోబల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక చైనాలోని చాలా రాష్ట్రాల్లో పిల్లల జననాల రేటును పెంచేలా రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను రాయితీలు, ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీలు ఇస్తున్నాయట.
ఇద్దరు పిల్లల్ని కని మూడో బిడ్డను కనాలనుకుంటే రాయితీలో విద్య అందించడం లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. 1980-2015 వరకు చైనాలో వన్‌ఛైల్డ్ పాలసీని బాగా ఇంప్లిమెంట్ చేశారు. దాని ఫలితమే జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ ఎఫెక్ట్‌తో ఇటీవల కాలంలో ఇది ప్రమాదకర స్థాయికి చేరిందని గణాకాంలు వెల్లడిస్తున్నాయి. దాంతో దేశ వ్యాప్తంగా జనాభా తగ్గుదల మొదలైంది. ఇటీవల జనాభాలో చైనాను భారత్ దాటేసిన తరుణంలో చైనా ప్రభుత్వం మేల్కొంది. అయితే, అక్కడి మహిళలు మాత్రం సంతానానికి సుముఖత చూపడం లేదట.
Read Also : CBI Director: సీబీఐకి కొత్త డైరెక్టర్.. ఎవరీ ప్రవీణ్ సూద్ ?