Andhra Pradesh: ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జగన్ సర్కార్ మరో ట్విస్ట్ ఇచ్చింది. విజయవాడకు సమీపంలోని ఉండవల్లి కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసింది. చంద్రబాబు కొన్నేళ్లుగా లింగమనేని గెస్ట్ హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు.
గతంలో అధికారంలో ఉండగా లింగమనేని గెస్ట్ హౌస్‌లోనే చంద్రబాబు అధికారిక కార్యకలాపాలను ఎక్కువ శాతం నిర్వహించారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో చంద్రబాబు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డడారని, ఆస్తుల జప్తుకు ఏపీ సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సమాచారం అందించి కరకట్ట పక్కనున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను జప్తు చేసుకోవాల్సిందిగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై రాజకీయంగా వివాదం రేగింది. అటు తెలుగుదేశం పార్టీ నేతలు దీన్ని తప్పు పడుతుండగా, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు, టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక చంద్రబాబు ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని.. మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పూలింగ్‌లో లేని గెస్ట్‌హౌస్ చంద్రబాబుకు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చట్ట ప్రకారం నిందితుల ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిందని స్పష్టం చేశారు. గతంలో లింగమనేని ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చారని స్వయంగా చంద్రబాబు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సిందని.. స్టేలు తొలగటంతో ఇప్పుడు చర్యలు చేపట్టారని క్లారిటీ ఇచ్చారు.
చంద్రబాబు ప్రతిదానికీ స్టేలకు వెళ్లటం దేనికని పేర్నినాని ప్రశ్నించారు. తప్పుచేయకపోతే.. ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందన్న పేర్ని నాని.. దోషులుగా తేలితే ఎంతటి వారిపైనా చర్యలుంటాయంటూ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు.
అమరావతి రాజధానిలో జరిగిన అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధారాలతో సహా పిటిషన్ వేశారని గుర్తు చేశారు. ఆ పిటిషన్‌పై సీబీసీఐడీ విచారణ వేశారని, దర్యాప్తులో భాగంగానే లింగమనేని రమేష్, ఇతర వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా జరిగిందని తేలిందన్నారు.
Read Also : Telangana: తెలంగాణ అవతరణ వేడుకలకు సన్నద్ధం.. 21 రోజులపాటు నిర్వహణకు కసరత్తు