ఇంట్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేయడం సాధారణం. కానీ ఇప్పుడు పొలాల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేయడం మొదలైంది. టమాట ధరలు పెరిగినప్పుడు టమాట పంటను కాపాడుకోవడానికి కొందరు రైతులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వెల్లుల్లి ధరలు పెరగడంతో వెల్లుల్లి పంటను కాపాడుకోవడానికి రైతులు కెమెరాలతో గస్తీ కాస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలోని మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల పొలాల్లో వెల్లుల్లి చోరీలు పెరగడంతో రైతులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయి. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగుతుంది. కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత దొంగతనాలు ఆగిపోయాయని రైతులు చెబుతున్నారు.
వెల్లుల్లి ధరలు గత 60 ఏళ్లలో ఎప్పుడూ ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. 2023లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు ఈ ఏడాది పంట వేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో సరఫరా తగ్గి ధరలు పెరిగాయి.
ఛింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తారు. సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుంది.
వెల్లుల్లి ధరలు పెరగడంతో చోరీలు కూడా పెరిగాయి. దీంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి సీసీ కెమెరాలను ఆశ్రయిస్తున్నారు.