తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో పీసీసీ కమిటీల నియామకం అగ్గిరాజేసిన నేపథ్యంలో సీనియర్లంతా మూకుమ్మడిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ, మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితర నేతలు పీసీసీ కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన బ్యాచ్ అంతా సీనియర్లయిన తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
టీడీపీ నుంచి వచ్చిన వారికే పీసీసీ కమిటీల్లో చోటు దక్కిందని సీనియర్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే సేవ్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్నారు. ఈ పరిణామాలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ కన్నేసి ఉంచారు. నిన్న పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. వ్యూహాత్మకంగా సీనియర్ల వ్యవహారంపై మాట దాటవేశారు. ఏఐసీసీ సూచనల మేరకే పీసీసీ పదవుల కేటాయింపు జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాలపై ఏఐసీసీ ఆరా తీసిందట. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న అసంతృప్తుల బెడద, పదవుల పంచాయితీ, సీనియర్ల అలక, నేరుగా సమావేశాలు కావడం.. లాంటి ఘటనలపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ గుర్రుగా ఉన్నారట. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్‌తో నివేదిక తెప్పించుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
సీనియర్లతో భేటీ.. హైకమాండ్‌కు రిపోర్టు
పీసీసీ పదవుల పంపకాలపై అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడాలని ఠాగూర్.. నదీమ్ జావీద్‌కు సూచించారట. సీనియర్లతో సమావేశం కావాలని సెక్రటరీలను మాణిక్కం ఠాగూర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మధు యాష్కీ తదితరులతో నదీమ్ జావీద్ భేటీ కానున్నట్లు సమాచారం. అసలు సమస్య పీసీసీ పదవులా? ఇంకేమైనా ఉందా? తెలుసుకొని ఫుల్ రిపోర్టును అధిష్టానానికి పంపనున్నట్లు తెలుస్తోంది.
also read news:
FIFA World Cup 2022 Final : ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ అర్జెంటీనా.. ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం