Telugu Flash News

Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట.. అమరావతి భూ కుంభకోణంలో అరెస్టులు తప్పవా?

supreme court

అమరావతి ల్యాండ్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ప్రస్తుత జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. గత ప్రభుత్వ అవకతవకలపై సిట్‌ దర్యాప్తును ఆపాలంటూ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్టేను ఎత్తి వేస్తూ తీర్పు వెలువరించింది. దర్యాప్తు జరిగితేనే తప్పేముందని ధర్మాసనం పేర్కొంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకమైన విధాన నిర్ణయాలు, అమరావతి ల్యాండ్‌ స్కామ్‌ సహా భారీ ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగినట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. పూర్తి పారదర్శకంగా విచారణ జరపాలని ఆదేశించింది. ఈ క్రమంలో సిట్‌ నియామకంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ వేయడంతో సిట్‌ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. ఈ స్టేను సవాల్‌ చేసిన ఏపీ సర్కార్‌.. సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం.. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున స్టే ఇవ్వడం సరైంది కాదని పేర్కొంది. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు పంపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న ఈ కేసులో స్టే అవసరం లేదంది. సిట్‌ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని పక్కనపెడుతున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్.షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు జగన్‌ సర్కార్‌పై తీవ్రంగా రియాక్ట్‌ అయ్యారు. చంద్రబాబు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ.. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఓవైపు భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనలోనూ సీఎం జగన్‌.. చంద్రబాబును ఏకిపారేశారు. కేవలం శిలాఫలకాలకే చంద్రబాబు పరిమితమని, ఆయన పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అనే నినాదమే పని చేసిందంటూ తూర్పారబట్టారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సుప్రీం తీర్పు తర్వాత స్పందిస్తూ.. చంద్రబాబు సహా స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులంతా జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అరెస్టులు తప్పవనే చర్చ జోరందుకుంది.

also read :

Rashmika: ర‌ష్మిక మందాన‌తో ఎఫైర్‌పై స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్

Mahesh: ఆ స‌మ‌యంలో ఎందుకు బ‌తికున్నారా అనిపించింది.. మ‌హేష్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

 

Exit mobile version