England vs Pakistan 1st Test: ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో ఆసక్తికరంగా గేమ్ ఉండేది. కాని ఎప్పుడైతే టీ20లు మొదలయ్యాయో అప్పటి నుండి టెస్ట్ క్రికెట్‌లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజులలో టెస్ట్ క్రికెట్ పరిస్థితి మరింత దారుణంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ తొలి టెస్ట్ జరుగుతుండగా, ఇందులో రికార్డులు బద్దలయ్యాయి. తొలి టెస్టులో ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడంతో పాటు వారు ఇది టెస్ట్ మ్యాచ్ అన్న సంగతి మరిచిపోయి టీ20లా ఆడేశారు. సిక్సులు, ఫోర్లు కొడుతూ భారీ స్కోరు నమోదు చేశారు.
ఓపెనర్లు జాక్ క్రాలీ (111 బంతుల్లో 21 ఫోర్లతో 122), బెన్ డక్కెట్(110 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఓలీ పాప్(104 బంతుల్లో 14 ఫోర్లతో 108), హరీ బ్రూక్( 151) సైతం శతకాలు నమోదు చేశారు.
టాప్-5 బ్యాటర్లలో నలుగురు సెంచరీలు నమోదు చేయడంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఇంగ్లండ్ బ్యాటింగ్ తీరుని చూసి టెస్ట్ మ్యాచా? లేక ధనాధన్ ఫార్మాటా? అని ఫ్యాన్స్ అయోమయానికి గురయ్యారు.
ఏ సెషన్‌లోనూ పాక్ బౌలర్స్ ప్రభావం చూపలేకపోయారు. జాహిద్ మహమూద్ రెండు వికెట్లు తీయగా.. హారీస్ రౌఫ్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు.
పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరిస్తున్న ఈ పిచ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిస్సారమైన పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు పండుగ చేసుకోవడం జీర్ణించుకోలేని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాపై దుమ్మెత్తి పోస్తున్నారు.
టెస్టు క్రికెట్ ను సర్వనాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. కామెంటేటర్ గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ పాకిస్తాన్ జట్టు మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుందని కామెంట్స్ చేసేవాడు. ఇప్పుడు పీసీబీ చీఫ్ అయ్యాక ప్రత్యర్థి జట్టు ఒకరోజులో 500 పరుగులు చేసేవిధంగా పిచ్ లు తయారుచేస్తున్నాడు. అని ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు.
also read news:
చలికాలంలో వచ్చే జలుబు మరియు ఫ్లూ నివారణ కోసం ఈ 5 మసాలాలను తీసుకుంటే చాలు