ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన అసమర్థతను బహిర్గతం చేసిందని, కేవలం పోలీసుల బలంతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు.. ఎంతకాలం ఈ మోసాలు..?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కేసీఆర్ హయాంలో గురుకులాలు అద్భుతంగా వృద్ధి చెందినాయని, కానీ రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని ఆరోపించారు. గురుకుల విద్యార్థులు ఎవరెస్టు, కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన సందర్భాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితులను దారుణంగా పోల్చారు.
గురుకులాల్లోని సమస్యలను అధ్యయనం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేసినా, ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. “విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన మా వాళ్లను రేవంత్ రెడ్డి ఆపుతున్నారు. విద్యార్థులే రోడ్ల మీదకు వస్తున్నారు.. ఎంత మందిని అడ్డుకుంటావు..?” అంటూ ప్రశ్నించారు.
గురుకులాల్లో విషాహారం విషయంలో బీఆర్ఎస్ పై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. పాలన చేతకాకనే బీఆర్ఎస్‌పై నిస్సిగ్గుగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వివిధ శాఖలకు మంత్రులు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ముఖ్యంగా విద్యా శాఖకు మంత్రి లేకపోవడం దుర్మార్గమని అన్నారు.