moral stories in telugu : సీతాపతి అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి, బండిలాగి సీతాపతికి ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. సీతాపతి ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును కొనితెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి, కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు.
ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగ అనుకున్న సీతాపతి ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి “నీకు పని చేసే వయసు అయిపోయింది. శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకో” అని ముసలి ఎద్దును తరిమేశాడు. ముసలి ఎద్దు ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు.
ముసలి ఎద్దు తన జాలి గాథ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని సీతాపతి ఇంటికి వెళ్లి “ఈ ఎద్దు నీదేకదూ!” అని అడిగాడు. అవునన్నాడు సీతాపతి. “దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యి వరహాలు ఇస్తాను.” అన్నాడు గోపన్న.
సీతాపతి ఆశ్చర్యపోగా ‘నీకు తెలియదా? ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి, రోజూ దానికి నమస్కరించి, మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది’ అని చెప్పాడు. సీతాపతి తన ముసలి ఎద్దును తీసేసుకుని, నాటినుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్లేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు సీతాపతి.
నీతి: ముసలివారిని ఎప్పుడూ తృణీకరించకూడదు. వారు కూడా మనకు ఎంతో సహాయం చేయగలరు.