Hyderabad Rains : భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి.
ముఖ్యంగా ఐటీ జోన్‌లో ట్రాఫిక్ మరింత ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. కుండపోత వర్షాల కారణంగా హైదరాబాద్ జలమయమైంది.
ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో వర్షం కారణంగా రద్దీ పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
ఐటీ ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. అత్యవసర సేవల ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు.
నగరంలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఐటి ఉద్యోగులు Work From Home ఎంపిక చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదు. pic.twitter.com/ekGREts5Xv
— Cyberabad Police (@cyberabadpolice) September 5, 2023