అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం సాయంత్రం గుజరాత్‌లోని కచ్ జిల్లా తీరం దాటనుంది. గుజరాత్‌లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇది గుజరాత్‌లోని కచ్, దక్షిణ పాకిస్థాన్‌లోని కరాచీ వద్ద దిశను మార్చుకుని జఖౌ వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. తుపాను మందగించిందని, కదలడం దాదాపు ఆగిపోయిందని, ఇది దిశను మారుస్తోందని సూచిస్తోందని IMD వివరించింది.
తుపాను సౌరాష్ట్ర, కచ్‌లను తాకుతుందని, మాండవి-కరాచీ మధ్య జఖౌ సమీపంలో తీరం దాటుతుందని స్పష్టం చేసింది. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రస్తుతం జాఖౌకు పశ్చిమ-నైరుతి దిశలో 210 కి.మీ, దేవభూమి ద్వారకకు పశ్చిమ-నైరుతి దిశలో 220 కి.మీ, నలియాకు పశ్చిమ-నైరుతి దిశలో 230 కి.మీ, పోర్‌బందర్‌కు పశ్చిమ-వాయువ్యంగా 290 కి.మీ మరియు కరాచీకి వాయువ్యంగా 300 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
బిపర్ జాయ్ తుఫాను స్వల్పంగా బలహీనపడినా గుజరాత్‌కు ముప్పు వాటిల్లుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. తుపాను కొద్దిగా బలహీనపడింది.. అయితే గురువారం తీరం దాటే సమయంలో 145 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సౌరాష్ట్ర, కచ్‌లో 2 నుంచి 3 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయన్నారు. రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయి’ అని ఆయన వివరించారు.
తుపాను ముప్పు కారణంగా గుజరాత్ తీర ప్రాంతాల్లో 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే దేవభూమి ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, పోర్‌బందర్, రాజ్‌కోట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను సన్నాహాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు.
తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యల కోసం 18 ఎన్‌డిఆర్‌ఎఫ్, 12 ఎస్‌డిఆర్‌ఎఫ్, 115 రోడ్లు, భవనాలు, 397 విద్యుత్ బృందాలను సిద్ధం చేశారు. మహారాష్ట్రలో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు మోహరించారు. ముంబైలో 5 బృందాలను సిద్ధంగా ఉంచారు.
బిపర్ జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, డామన్, డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
read more :
Cyclone Biparjoy : సముద్రం అల్లకల్లోలం..
Cyclone Biparjoy : మూడు రోజుల పాటు కరెంటు ఉండదు.. ఏర్పాట్లు చేసుకోవాలని అధికారుల సూచన