CM KCR: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంపై మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. దేశానికి స్త్రం చేసిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా చాలా సమస్యలు అలాగే ఉండిపోయాయని తెలిపారు. చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా బాగా అభివృద్ధి చెందాయని చెప్పారు.
రైతు బాగుపడే దాకా దేశంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ.. ఇరు రాష్ట్రాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని కేసీఆర్ తెలిపారు. రెండు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే చాలా సమస్యలకు పరిష్కారం చూపామన్న కేసీఆర్.. కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకు ఉందని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ పుష్కలంగా తాగునీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో పలుచోట్ల వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు భారత దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అన్నదాతలకు తోడుగా రైతుబంధు సాయం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైన అభివృద్ధి వేరే రాష్ట్రాల్లో ఎందుకు కావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా ఓ మార్పు తేవాలనే సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితి ఏర్పాటు జరిగిందని కేసీఆర్ తెలిపారు. మనదేశంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని, కానీ వాటిని వాడుకోలేక వృథా చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల వర్షం పడుతుంటే మనం కేవలం 20 వేల టీఎంసీల వాటర్‌నే వినియోగించగలుగుతున్నామన్నారు. బీఆర్ఎస్ శిక్షణ శిబిరాల ద్వారా పలువురు ఇతర పార్టీల నేతలు పార్టీలో చేరారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు చాలా మాట్లాడుతున్నారని, వారి కలలు కల్లలుగానే ఉంటాయన్నారు.
Read Also : NTR : ఒకే వేదికపై తారక్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో పాటు మరి కొంత మంది తారలు..