Weather Today : తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో చల్లటి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని పలు కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా నమోదు అయింది.
వచ్చే మూడు రోజులు అదే స్థాయిలో 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. గురువారం కూడా ఏ జిల్లాలోనూ 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. నల్లగొండలో 37, ఆదిలాబాద్లో 36.8, భద్రాచలం, ఖమ్మంలో 36.6, రామగండంలో 36.4, నిజామాబాద్లో 35.2 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
గురువారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగండ్లు, తేలికపాటి వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, మెదక్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వచ్చే నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. తీర ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE