viveka murder case : ఏపీలో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈనెల 30వ తేదీలోపు దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడైన గుజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని తాజాగా సీబీఐ అరెస్టు చేసింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో పని చేస్తున్నాడు.
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున నిందితులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డిలతో కలిసి వైఎస్ భాస్కరరెడ్డి నివాసంలోనే ఉన్నట్లుగా గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కుట్రలో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. సీఈఆర్పీసీ 161 కింద ఉదయ్‌కుమార్‌రెడ్డికి నోటీసులిచ్చి ఆయన స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేసింది.
ఉదయ్‌కుమార్‌రెడ్డి తండ్రి జయప్రకాశ్‌రెడ్డి, న్యాయవాది సమక్షంలోనే ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఈ అరెస్టు మెమోను కుటుంబ సభ్యులతో పాటు పులివెందుల పోలీసులకు అందజేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఇక పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్‌కు ఉదయ్‌కుమార్‌రెడ్డిని తరలించినట్లు సీబీఐ తెలిపింది. కడప నుంచి హైదరాబాద్‌కు తరలించి సీబీఐ జడ్జి నివాసంలో నిందితుడిని హాజరుపరిచారు.
న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్ ఇప్పటికే చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అరెస్టయిన ఉదయ్‌కుమార్‌రెడ్డి నెల రోజుల కిందటి వరకు సీబీఐ దర్యాప్తు అధికారిగా పని చేసిన ఎస్పీ రామ్‌సింగ్‌పై గతంలో కడప కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు.
కోర్టు ఆదేశాలతో ఎస్పీ రామ్‌సింగ్‌పై గతేడాదది ఫిబ్రవరిలో కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఉదయ్‌కుమార్‌రెడ్డి అరెస్టు కావడం ఈ కేసులో కీలకంగా మారనుందని తెలుస్తోంది. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులు ఉదయ్‌కుమార్‌రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. కుట్రలో ఉదయ్ భాగస్వామ్యం ఉందని సీబీఐ అనుమానిస్తోంది.
also read :
Ananya Nagalla: నన్ను ఎవ్వరూ ట్రై చేయలేదు.. అనన్య ఆసక్తికర కామెంట్స్
Upasana: మెగా కోడలు ఉపాసన తన సంపాదన మొత్తం వారికే ఇచ్చేసిందా?