BRS MLAs poaching case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై తమకు నమ్మకం లేదంటూ నిందితులు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ కూడా ఇంప్లీడ్ అయ్యింది.
సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కీలక విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, సిట్ దర్యాప్తు కొనసాగించాలని కోరారు. సీబీఐకి ఈ కేసును అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. అయితే, ఈ వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను, కేసు మొత్తం డీటెయిల్స్ సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం.
ఈ విషయమై కోర్టు తీర్పు తర్వాత బీజేపీ తరఫున వాదించిన రామచందర్ రావు మాట్లాడుతూ.. సిట్ దర్యాప్తు సక్రమంగా జరగలేదని ఆరోపణలు చేశారు. రాజకీయంగా వేధిస్తున్నారని కోర్టుకు వివరించామన్నారు. కేసులో బీజేపీ పేరు ప్రస్తావించారని, రాజకీయ దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి మరీ ఈ కేసుపై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనేక సాంకేతికపరమైన అంశాలను సిట్ అధికారులు పట్టించుకోలేదని కోర్టుకు తెలిపామన్నారు.
ఇరకాటంలో రోహిత్‌రెడ్డి..
ఈ కేసులో తొలుత తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గులాబీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిందితులైన సింహయాజి, రామచంద్ర భారతి, నందకుమార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. అనంతరం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ తీరుపై వీడియోలతో సహా ఆధారాలు బయటపెట్టారు. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై నేరుగా ఆరోపణలు చేశారు కేసీఆర్. అనంతరం కేసు దర్యాప్తు చేసేందుకు సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తర్వాత ఈడీ విచారణకు రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. తాజా ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు రోహిత్‌రెడ్డి.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు