టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని చెప్పారు చంద్రబాబు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. తెలంగాణలోని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అటు ఏపీలో వైసీపీ సోషల్ మీడియాలోనూ చంద్రబాబు వ్యాఖ్యలను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబుకు మైండ్ సరిగా పని చేయడం లేదని సెటైర్లు వేస్తున్నారు.
ఈ విషయంపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు గతంలో శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్‌రెడ్డి అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చంద్రబాబు ప్రసంగించిన అంశాలను ఉటంకిస్తూ.. వరప్రసాద్‌రెడ్డి చెప్పిన మాటలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రపంచంలోనే అందరికంటే ముందుగా హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌ను శాంతా బయోటెక్ కంపెనీ కొనుగొంది. ఈ అంశాన్ని అప్పటి ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ వద్దకు వెళ్లి చెప్పగా.. ఆయన ఎంతో సంతోషించారు. వెంటనే వ్యాక్సిన్ ఆవిష్కరణకు ఏపీకి వస్తానని చెప్పారు.
అనంతరం ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రికి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్‌రెడ్డి.. అప్పటి సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు బాబు నిరాకరించారు. అయితే, క్యాబినెట్ మినిస్టర్లలో ఒకరైన తన మిత్రుడి ద్వారా ఎలాగోలా అపాయింట్‌మెంట్ సంపాదించి చంద్రబాబును కలిసి విషయం చెప్పగా.. ఆయన వరప్రసాద్‌రెడ్డితో ముభావంగానే మాట్లాడారు. ఐ టు ఐ కాంటాక్ట్‌లో మాట్లాడకుండా విషయం అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. నాటి సెక్రటరీ ఎస్వీ ప్రసాద్ వైపు చూస్తూ.. ప్రాజెక్టు కాస్ట్ ఎంత? అని ప్రశ్నించారు. 20 కోట్ల రూపాయలని వరప్రసాద్‌రెడ్డి సమాధానం ఇవ్వగా.. తనకు సమయం లేదని చంద్రబాబు చెప్పారు.
సో వాట్.. వి ఆర్ మేక్ ప్రైమ్ మినిస్టర్స్..
సర్.. ప్రధాన మంత్రి ఒప్పుకొని ఆవిష్కరణకు వస్తానన్నారు.. ప్రోటోకాల్ ఇష్యూ కారణంగా ముఖ్యమంత్రి లేకుండా కార్యక్రమం నిర్వహించరాదని మీ వద్దకు వచ్చానని వరప్రసాద్‌రెడ్డి చెప్పగా.. సో వాట్.. మనం ప్రధాన మంత్రులను తయారు చేస్తాం.. అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇక నమస్కారం పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయానని శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం ఖమ్మంలో చంద్రబాబు వ్యాక్సిన్ వ్యాఖ్యల నేపథ్యంలో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు టీడీపీ శ్రేణులు సైతం దీటుగా సమాధానాలు ఇస్తున్నారు. జీనోమ్ వ్యాలీని చంద్రబాబు ప్రారంభించారంటూ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలను షేర్ చేస్తున్నారు. ఇలా చంద్రబాబు కరోనా వ్యాక్సిన్ వ్యాఖ్యలపై నెట్టింట వార్ నడుస్తోంది.
— Veera Reddy (@tvrtdp) December 23, 2022