H1B Visa: అమెరికాలో వృద్ధిరేటు వేగంగా దూసుకెళ్తున్నా ఉద్యోగాల కోతతో ఆ దేశం సతమతమవుతోంది. గతేడాది నుంచి అక్కడ అనేక కంపెనీలు ఉద్యోగులను ఉన్నఫళంగా తొలగిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం వలస వచ్చిన వారు ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల్లో కొత్త కొలువు వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే గ్రీన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. ఇవి రెండూ కాలేదంటే ఇక వారి సొంత దేశానికి వెళ్లిపోవాల్సిందే. ఈ క్రమంలో భారతీయులు చాలా మంది ఇప్పుడు యాతన పడుతున్నారు.
చాలా కాలం కిందటే అమెరికాకు వెళ్లి స్థిరపడిన అనేక మంది భారతీయులకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఉద్యోగాలు కోల్పోతున్న వారు ఇప్పుడు కొత్తగా 60 రోజుల్లోపు ఉద్యోగం రాకపోతే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఏళ్లతరబడి హెచ్1బీ వీసా స్టేటస్‌లో పని చేస్తున్న వీరు.. ఇప్పుడు టెంపరరీ సిటిజెన్స్ కింద లెక్కేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ఇప్పుడు సంకట స్థితిలో గుండెదడతో అమెరికాలో ఉండాల్సి వస్తోంది.
మాంద్యం నేపథ్యంలో అమెరికాలో టెక్ దిగ్గజ సంస్థలు చాలా వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. పొదుపు చర్యల్లో భాగంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో నిమగ్నమయ్యాయి. గతేడాది నుంచి ఇది పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని కంపెనీలూ కూడబలుక్కొని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.46 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దారిలో టెక్ సంస్థలతో పాటు ఇతర ప్రముఖ కంపెనీలు కూడా ఉండటం గమనార్హం.
ఎంతమందిని తొలగిస్తారో క్లారిటీ లేదు..
మరోవైపు ఉద్యోగుల తొలగింపుపై ఎవరికీ అంతు పట్టడం లేదు. ఫలానా కంపెనీ ఎంత మందిని తొలగిస్తుందో ముందే క్లారిటీ వస్తే మిగతా మిగిలిన వారైనా కనీసం స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగాలు తొలగిస్తే.. ఇతర కంపెనీలైనా తీసుకుంటాయా? అనే ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి.
ప్రస్తుతం ఉద్యోగాల తొలగింపు ట్రెండ్ నడుస్తుండడంతో అన్ని కంపెనీలూ కొత్తగా రిక్రూట్ చేసుకోవడాన్ని ఆపేశాయని చెబుతున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసాలు ఉన్న వారు సుమారు 5 లక్షల మందికిపైగానే ఉంటారని అంచనా. వీరిలో అధిక శాతం మంది భారత్, చైనా నుంచి వెళ్లినవారేనని తెలుస్తోంది.
also read news:
special stories : శాంటా క్లాస్ గా మారి చిన్న పిల్లల కోరికలు తీరుస్తున్న ఆ ఇద్దరు..
Special Stories : సాల్వ్ అయ్యి అవ్వనట్టు సాల్వ్ అయిన హత్య కేసు..