టీమిండియా క్రికెటర్, మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్ అవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వరుసగా మూడు వన్డేల్లో ఇలా డకౌట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతడిపై టీమిండియా మాజీలు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న సూర్యను టీ20లకే పరిమితం చేయాలని, వన్డేల నుంచి తప్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, సూర్యకు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు.
వన్డేల్లో మున్ముందు సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేయడం ఖాయమని యువీ దీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాదిలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కీలకంగా మారనున్నాడని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సూర్య గురించి యువరాజ్ స్పందించాడు. ప్రతి ఆటగాడికీ తన కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదురు కావడం సహజమన్నాడు. తామందరం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని గుర్తు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా మళ్లీ తన ఫాంను అందుకుంటాడని యువీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.
మరోవైపు ఈ ఏడాదిలోనే అక్టోబర్-నవంబర్ మాసాల్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ 2011 వన్డే వరల్డ్‌కప్ సీన్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి టీమిండియా క్రికెట్ అభిమానులు ఐసీసీ టోర్నీ గెలిచి తీరాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని రాణించాల్సి ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత జట్టులో చాలా వరకు పుంజుకోవాలని చెబుతున్నారు.
ఇక టీ20ల్లో చెలరేగి ఆడే మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో తడబడుతున్నాడు. పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 21 ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. 24.06 సగటుతో 433 రన్స్ మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో చేతులెత్తేశాడు. దీంతో ఇక ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈనెలాఖరులో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనిపై దృష్టి పెట్టి సూర్యకుమార్ రాణిస్తే.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఐపీఎల్‌లో కూడా చేతులెత్తేస్తే ఇక అతడి కెరీర్ ప్రమాదంలో పడినట్లేనంటున్నారు.
Surya Kumar Yadav : సూర్య కుమార్ విజయ రహస్యం ఏంటో తెలుసా?