Telugu Flash News

YS Sharmila: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. షర్మిల అరెస్టు, పాదయాత్ర క్యాన్సిల్‌!

ys sharmila arrest

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila)  అధికార పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తీవ్ర పదజాలం వాడుతూ బెంబేలెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సంయమనం కోల్పోతూ మాటతూలుతున్నారు. అధికార పార్టీపై డామినేషన్‌ ప్రదర్శించాలనే తపనతో కాస్త పట్టుతప్పుతున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టుకు చేరిన పంచాయితీతో షర్మిల కండీషన్ల మధ్య పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

మరోవైపు తనపై బీఆర్ఎస్ శ్రేణులు అక్రమంగా దాడికి పాల్పడ్డారని షర్మిల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదనల అనంతరం షర్మిల పోలీసుల సూచనలు పాటించి పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇక అప్పటి నుంచి ఆమె పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తాజాగా అధికార పార్టీపై మరోసారి షర్మిల తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

వైఎస్‌ షర్మిలను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారంటూ షర్మిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో వైఎస్సార్‌ టీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించిన షర్మిల.. అధికార పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని బీఆర్ఎస్ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లూనావత్‌ అశోక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఇదే కేసులో షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

also read :

YS Avinash Reddy : అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ పిలుపు.. 24న విచారణకు రావాలని సూచన

Taraka Ratna: తార‌క‌ర‌త్న ప్రాణాలు పోవ‌డానికి ఆ చిన్న త‌ప్పే కార‌ణమా?

 

Exit mobile version