Telugu Flash News

YS Sharmila: గవర్నర్‌ తమిళిసైతో షర్మిల భేటీ.. పాదయాత్ర పునఃప్రారంభం..

ys sharmila padayatra

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల (YS Sharmila) నేడు గవర్నర్‌ తమిళిసైతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, ప్రజా వ్యతిరేక పాలనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్‌తో భేటీ అనంతరం షర్మిల పాదయాత్ర పునఃప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర షెడ్యూల్‌ను కూడా పార్టీ ప్రకటించింది. నర్సంపేట నియోజకవర్గం నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం కానుందని పార్టీ తెలిపింది.

నేటి నుంచి పునఃప్రారంభం కానున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నారావు పేట మండలం శంకరమ్మ తాండా నుంచి షర్మిల పాదయాత్రను కొనసాగిస్తారు.

నెక్కొండ మండల పరిధిలోని తోపన గడ్డ తాండా, నెక్కొండ మీదుగా 224వ రోజు పాదయాత్ర సాగనుందని పార్టీ తెలిపింది. సాయంత్రం 5.30 గంటలకు నెక్కొండ మండల కేంద్రంలో మాట – ముచ్చట ఉంటుందని వైఎస్సార్‌టీపీ తెలిపింది.

షర్మిల ఇప్పటికే పలుసార్లు గవర్నర్‌తో భేటీ అయ్యారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ కానున్నారు షర్మిల.

సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను గవర్నర్‌కు వివరించనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నట్లు సమాచారం.

గవర్నర్‌తో భేటీ ముగిశాక నర్సంపేటకు షర్మిల బయల్దేరుతారు. గతంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శల కారణంగా ఆమె కాన్వాయ్‌పై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు దాడులకు పాల్పడటంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

తర్వాత దెబ్బతిన్న తన కారుతోపాటు ప్రగతిభవన్‌కు బయల్దేరిన షర్మిలను పోలీసులు కారుతోపాటే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తర్వాత గవర్నర్‌ కూడా జోక్యం చేసుకొని ఒక మహిళపై పోలీసులు ఇలా ప్రవర్తించడం తగదని పేర్కొన్నారు.

కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో తాజాగా షర్మిల పాదయాత్ర పునఃప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి అయినా ప్రశాంతంగా ఆమె పాదయాత్ర చేసుకుంటారో లేదో అని ఉత్కంఠ ఏర్పడింది.

also read :

Vijay- Rashmika : ర‌ష్మిక‌, విజ‌య్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..

Hanuma Vihari : లెఫ్ట్‌ హ్యాండర్‌గా మారిన హనుమ విహారి.. గాయం కారణంగా ఒంటిచేత్తోనే పోరాటం

Exit mobile version