ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan mohan reddy) నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం జగన్.. తాను విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నానని, పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికిన నేపథ్యంలో తాజాగా కేబినెట్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు విశాఖ బీచ్ రోడ్డులో సీఎం నివాసం కోసం అధికారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. పరిపాలన రాజధానిగా అక్కడే కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తానని జగన్ పదే పదే చెబుతున్నారు. తాజాగా కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణమస్తు పథకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
దీంతోపాటు ఇంకా పలు పథకాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు మంత్రి చెల్లుబోయిన పేర్కొన్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు పథకంలో గతం కంటే ఎక్కువ ఇస్తున్నామని మంత్రి వివరించారు. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం నెలకొల్పేందుకు నిర్ణయం జరిగిందన్నారు.
కర్నూలు జిల్లా డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో బోధన సిబ్బంది నియామకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఫిబ్రవరిలో రైతులకు ఇన్‌ఫుట్ సబ్సీడీ చెల్లింపునకు కూడా ఆమోదం లభించింది. ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన నిధులు జమ చేసేందుకు ఓకే చేశారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. మరోవైపు నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
also read:
KA Paul On Revanth Reddy : టెర్రరిస్టులా రేవంత్ వ్యాఖ్యలు.. వెంటనే అరెస్టు చేయాలి..
Viral Video : కమలా హ్యారిస్ భర్తకు జిల్ బైడెన్ లిప్ కిస్..
Hyderabad Traffic : ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు కార్ రేసింగ్.. నగరవాసులకు నరకం..