Telugu Flash News

YS Jagan : 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా? చంద్రబాబు, పవన్‌కు జగన్‌ సవాల్‌..!

cm jagan challenges pawan and chandrababu

ఇటీవల కాలంలో కాస్త సైలెంట్‌గా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan mohan reddy) ఈరోజు ఉగ్రరూపం చూపించారు. ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా కౌంటర్లు ఇచ్చే వైసీపీ శ్రేణుల్లో జోష్‌ పెంచేశారు.

వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌ కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారంలోకి వచ్చిన నాలుగో ఏడాది కూడా వరుసగా రైతులకు చేదోడుగా నిలుస్తున్నామని, ఇందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. రైతన్నలకు ఒక్కొక్కరికి రూ.13,500 చొప్పున ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇప్పటికే ఈ ఏడాది రూ.11,500 చొప్పున అందించాయి. ఇక మూడో విడతలో భాగంగా రూ.2 వేలు ఒక్కొక్కరి ఖాతాలో జమ చేశారు. కర్ణాటకలో ప్రధాని మోదీ నిన్ననే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. ఏపీ సీఎం ఆరోజు బటన్‌ నొక్కారు.

దేవుడి దయ వల్ల రైతన్నలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నామని జగన్‌ తెలిపారు. అరకోటికిపైగా రైతు కుటుంబాలకు ఈ కార్యక్రమం వల్ల మంచి జరుగుతోందన్నారు. నాలుగేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.54 వేల చొప్పున సాయం చేశామన్నారు.

రైతు భరోసా స్కీమ్‌లో నాలుగేళ్లు కూడా గడవకమునుపే రైతన్నల కుటుంబాలకు అందించిన సాయం.. రూ.27,062 కోట్లు అని జగన్‌ తెలిపారు. రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇదని.. వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇలా ఉంటుందన్నారు.

ఇక పొలిటికల్‌గా ఈ మధ్య హాట్‌ కామెంట్స్‌ తగ్గించిన జగన్‌.. ఈ సభ వేదికగా రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో జగన్‌ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు తోడయ్యాడని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ విసురుతున్నా.. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి.. దమ్ముందా.. పోటీ చేస్తారా? అంటూ జగన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

మరోవైపు ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

పొత్తులేకుండా గత ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు.. ఘోర పరాజయాన్నిచవిచూసిన నేపథ్యంలో పొత్తులతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ ఉండబోతోంది. ఈ నేపథ్యంలోజగన్‌ వీరికి మంటపుట్టించే వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా కలకలం రేగుతోంది.

also read :

Keerthy Suresh Looks Stylish at Netflix Red Carpet Event

Actress Pooja Hegde at Zee Cine Awards 2023 Event

Rashmika Mandanna at Zee Cine Awards 2023 Photos and Videos

Kiara Advani at Zee Cine Awards 2023 Photos and Videos

Exit mobile version