YS Avinash Reddy: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణలో హైడ్రామా నడిచింది. వాస్తవానికి ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. మొన్న కూడా ఆఖరి నిమిషంలో అవినాశ్ రెడ్డి విచారణకు రాలేనని సీబీఐకి లేఖ రాశారు. దీంతో మరోసారి నేడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు సూచించారు. దీంతో ఇవాళ విచారణకు బయల్దేరిన అవినాశ్ రెడ్డి.. మార్గంమధ్యలో ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి.
తన తల్లి శ్రీలక్ష్మీకి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారని ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కారణం చేత సీబీఐ విచారణకు హాజరు కాలేనని చెబుతూ సీబీఐకి మరోలేఖ రాశారు. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేందుకు అవినాశ్ రెడ్డి తరఫున లాయర్లు సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని, ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆ లేఖలో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి జైలులో ఉన్నారని, తన తల్లి ఆరోగ్యంపై తానే చూసుకోవాలని చెప్పారు.
ఇలా సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి గైర్హాజరు కావడం రెండోసారి కావడం గమనార్హం. ఈనెల 16వ తేదీన ఎంపీ సీబీఐ విచారణకు రావాల్సి ఉండగా, ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల కడప వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సీబీఐకి తెలియజేశారు. అయితే, సీబీఐ అధికారులు కూడా కడప చేరుకున్నారు. ఎంపీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని ఎంపీ డ్రైవర్‌కు నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం విచారణ కోసం హైదరాబాద్ వస్తుండగా మార్గం మధ్యలో తన తల్లి అనారోగ్యం విషయం తెలిసిందని ఎంపీ పేర్కొన్నారు.
అయితే, మళ్లీ తన తల్లి ఉన్న అంబులెన్స్‌లోనే ఎంపీ అనంతపురం సమీపంలో ఎక్కారు. అంబులెన్స్‌లోనే హైదరాబాద్‌కు చేరుకున్నట్లు టీవీల్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అవినాశ్‌రెడ్డిని వెంటాడిన ఓ టీవీ చానల్‌కు సంబంధించిన జర్నలిస్టులపై అవినాశ్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తమ వెంట పడుతున్నారంటూ జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఓ వెహికల్ అద్దాలు పగులగొట్టారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : CM KCR: దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో ఏం జరిగింది? కేసీఆర్ ప్రశ్న