yediyurappa : రాజకీయంగా, పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల వైపు వెళుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. కర్ణాటకలో నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. మాండ్య, హాసన్, బెంగళూరు (రూరల్), చిక్కబల్లాపూర్ స్థానాలను జేడీఎస్ కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2019లో ఈ నాలుగు సీట్లలో మూడు సీట్లను బీజేపీ గెలుచుకుంది. హాసన్‌లో మాత్రమే జేడీఎస్ విజయం సాధించింది. జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్‌డీ దేవెగౌడ తుమకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దేవెగౌడ మనవడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో జేడీఎస్‌కు 10 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 14 శాతం ఓట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో జేడీఎస్ కు బీజేపీతో పొత్తు కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జేడీఎస్‌తో పొత్తు బీజేపీకి కూడా చాలా ముఖ్యం. కాంగ్రెస్ నేతృత్వంలోని అఖిలపక్ష కూటమి((I.N.D.I.A) కి గట్టి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ ఇప్పటికే యోచిస్తున్న సంగతి తెలిసిందే. మే వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ 224 స్థానాలకు గానూ 135 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లోక్ సభ స్థానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఏ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. అందులో భాగంగానే జేడీఎస్ తో పొత్తు కుదిరిందనే చర్చ సాగుతోంది.