WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా సీనియర్ అజింక్యా రహానె పునరాగమనం చేయగా.. కేఎల్ రాహుల్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
అయితే, వికెట్ కీపర్, బ్యాటర్‌గా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ మాత్రమే ఎంపిక కావడంతో కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. రహానె నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉండటంతో రాహుల్‌కు చాన్స్ దక్కేది అనుమానమే అనే విశ్లేషణలు వస్తున్నాయి. ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఓపెనర్ జోడీ విషయానికి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి.
జట్టు సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ లేదా గిల్.. ఎవరో ఒకరు రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో టీమిండియా ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. టెస్టుల్లో కూడా శుభమన్ గిల్ రాణిస్తున్నాడు. ఈ టెస్టు సీజన్‌లో 44.22 సగటుతో 311 పరుగులు చేశాడు గిల్.
అదే సమయంలో కేఎల్ రాహుల్ విషయానికి వస్తే కేవలం 13.57 సగటుతో 95 పరుగులే చేశాడు. ఇటువంటి పరిస్థితిలో ప్రదర్శనను చూస్తే, ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ బదులు గిల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌తో తన ఫామ్‌ను తిరిగి సంపాదించిన సీనియర్ క్రికెటర్ అంజిక్యా రహానె.. ఫైనల్ మ్యాచ్‌లో తన సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రంజీలో రహానె 11 ఇన్నింగ్స్ ఆడి 634 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్‌లోనూ 50కిపైగా సగటుతో 180కిపైగా స్ట్రైక్ రేట్‌తో రహానె చెలరేగి ఆడుతున్నాడు. దీంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకున్నారు.
ఇక మిడిలార్డర్‌లో పుజారా, విరాట్ కోహ్లీ ప్రత్యేక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ గాయాల పాలు కావడంతో వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో రహానెకు కలిసి వచ్చింది. ఇక లోయర్ ఆర్డర్, ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరినీ జట్టులోకి తీసుకున్నారు.
పేసర్లలో ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌ల బౌలింగ్.. ఓవల్ గ్రౌండ్‌కు సెట్ అవుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తుది జట్లులో మాత్రం ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
also read :
‘Ponniyin Selvan 2′ Review :’పొన్నియన్ సెల్వన్ 2’ తెలుగు మూవీ రివ్యూ
Agent Telugu Movie Review : ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ