Telugu Flash News

WTC Final: ఫైనల్లో నెగ్గిన విశ్వ విజేతకు ప్రైజ్‌ మనీ ఎంత దక్కుతుందంటే..

WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధం అవుతోంది. ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నారు టీమిండియా సభ్యులు. ఇప్పటికే స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ముగిశాక రోహిత్‌ శర్మతోపాటు మిగతా ప్లేయర్లంతా ఇంగ్లండ్‌ బయల్దేరుతారని తెలుస్తోంది. తాజాగా డబ్ల్యూటీసీకి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. జూన్‌ 7వ తేదీ నుంచి 11వ తేదీ దాకా ఇంగ్లండ్‌లోని ఓవెల్‌ మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ పోరు జరగనుంది.

2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. దీంతో పాటు ఈ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీని తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రకటించింది. ఐసీసీ ఈ ఎడిషన్ ప్రైజ్ మనీ కోసం దాదాపు రూ.29.75 కోట్లు కేటాయించినట్లు తేలింది. ఇందులో 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జట్టుకు 13.22 కోట్ల రూపాయలను బహుమతిగా అందించనున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ. 6.61 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది.

ఇక టాప్‌ 2 జట్లతో పాటు మిగతా స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా నగదు బహుమతి అందించనున్నారు. స్టాండింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్‌ టీమ్‌కు రూ.3.71 కోట్లు ఇవ్వనున్నారు. మరోవైపు పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్‌లో నిలిచిన ఇంగ్లండ్ జట్టు రూ.2.89 కోట్లు బహుమతిగా పొందనుంది. 5వ ప్లేస్‌లో ఉన్న శ్రీలంక జట్టుకు 1.65 కోట్ల రివార్డ్‌ను ఐసీసీ అందించనుంది. శ్రీలంక తర్వాతి స్థానమైన ఆరో స్థానంలో న్యూజిలాండ్ ఉంది.

ఇక ఏడో ప్లేస్‌లో పాకిస్తాన్, ఎనిమిదో స్థానంలో వెస్టిండీస్, తొమ్మిదో ప్లేస్‌లో బంగ్లాదేశ్ ఉన్నాయి. శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉన్న జట్లకు రూ.84 లక్షల చొప్పున అందజేయనున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తుది పోరు కోసం ఇప్పటికే టీమిండియా హెడ్‌ కోచ్ రాహుల్‌ ద్రవిడ్ నేతృత్వంలో జట్టు సభ్యులు అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్‌ ఇంగ్లండ్‌లో అడుగు పెట్టారు. సహా సహాయక సిబ్బంది కూడా చేరుకున్నారు.

Read Also : WTC Final 2023: ఆస్ట్రేలియాతో పోరుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్‌ 11లో చోటు దక్కేదెవరికి?

Exit mobile version