Telugu Flash News

Binge-Eating : టీవీ చూస్తూ తినే వారికి బ్యాడ్ న్యూస్.. ఆ జబ్బులు వస్తాయట!

Binge-Watching TV and its Health Consequences

Binge-Eating : టీవీ ముందు కూర్చుని గంటల తరబడి చిరుతిళ్లు తింటున్నారా ? మీ ఆరోగ్యం జాగ్రత్త! . ఎందుకంటే టీవీ చూస్తూ చిరుతిళ్లు తింటే గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువట. ఇది మనం చెబుతున్నది కాదు.. శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

బ్రెజిల్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడ నివసిస్తున్న 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 33,900 మంది టీనేజర్లు, వారి ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి మొదలైన మొత్తం సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.

6 గంటల కంటే ఎక్కువ టీవీ చూసే వారిలో మరియు ఆ టైమ్ లో స్నాక్స్ తినేవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టు తెలిసింది . మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే మధుమేహం, గుండె జబ్బులు త్వరగా వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కాబట్టి టీవీని ఎక్కువగా చూసేవారు, ఆ సమయంలో చిరుతిళ్లు తినే వారు ఆ అలవాటుకు దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇంకా.. ఏం చెప్తున్నారంటే..  స్క్రీన్ టైమ్ అనేది కొత్త పదం ఏమి కాదు కానీ అది మన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది . మొబైల్, టీవీ, కంప్యూటర్ ఇలా ఏ స్క్రీన్‌కైనా కేటాయించే సమయాన్ని స్క్రీన్ టైమ్ అంటారు. దీని వల్ల మానసికంగా, శారీరకంగా రకరకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఎక్కువ స్క్రీన్ టైమ్ గడిపే అబ్బాయిల్లో ‘అతిగా తినడం’ సమస్య వస్తోందని గమనించారు. సాంకేతికంగా ఈ సమస్యను బింజ్ ఈటింగ్‌ అంటారు. మొబైల్ స్క్రీన్ కు అతుక్కుపోయిన వారిలో.. ఆహార పరిమితులు దాటే అవకాశం 62 శాతం ఉంది. టీవీలకు అతుక్కుపోయిన యువతలో 39 శాతం మంది ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఉందని కూడా తేలింది.

అతిగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. దాంతో పాటు ఇతర మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఆహారంపై నియంత్రణ లేకపోవడం వల్ల పశ్చాత్తాపం, ఎవరైనా చూస్తారేమోననే భయం, ఆహారం గురించి నిత్యం ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి పరిష్కారం సులభమే ! స్క్రీన్ టైమ్ నెమ్మదిగా తగ్గించి గ్రీన్ టైమ్ (ప్రకృతితో గడిపే సమయం) పెంచడంలో ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

 

Exit mobile version