Telugu Flash News

Medaram jathara : సమ్మక్క సారక్కలు ఎవరు ? మేడారం జాతర విశేషాలు తెలుసుకోండి

Medaram jathara

Medaram jathara

Medaram jathara : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయం, కట్టుబాట్లు అన్నీ ప్రత్యేకమైనవే. వీరి సంస్కృతిలో జాతరలు ఓ భాగం. సమ్మక్క, సారక్క జాతర వాటిలో మకుటాయ మానమైనది. ఈ జాతర వరంగల్ నుంచి 110 కి.మీ. దూరంలో ఉన్న తాడ్వాయి మండలానికి చెందిన దండకారణ్యం ప్రాంతంలో ఉన్న మేడారం గ్రామంలో నిర్వహిస్తారు.

ఆసియాఖండంలోకెల్లా జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఇది. కుంభమేళా తరువాత అతి పెద్దది. గిరిజనులు దేవతలుగా కొలిచే సమ్మక్క, సారక్కలను గద్దె మీదకు తీసుకువచ్చే కనువిందైన పండుగ ఇది. ఈ తల్లులను దర్శించటానికి లక్షలాదిమంది విచ్చేస్తారు. బంగారంగా భావించే బెల్లంతో తులాభారం వేస్తారు. వైరాగ్యాన్ని ప్రబోధించేలా కేశాలను ఇస్తామని మొక్కుకుంటారు.

sammakka sarakka jatara

సమ్మక్క సారక్కలు వనపుత్రికలు. ఈ తల్లులిద్దరూ గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలు, ఆపద్భాందవులు. సమ్మక్క సారక్క కేవలం ఆంధ్ర దేశంలోనే కాక యావద్భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు. ఎవరు ?

సమ్మక్క సారక్కలు ఎవరు ?

పన్నెండో శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతం లోని ‘పొలవాస’ను గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేటకోసం అరణ్యంలోకి వెళ్లినప్పుడు… సింహాల పరిరక్షణలో, పవిత్రమైన వెలుగుతో ప్రకాశిస్తున్న బాలికను తమ గ్రామానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. ఆ పసిపాప గ్రామంలో ప్రవేశించిన నాటినుంచి వారి కుటుంబాలలో సంపదలు నెలకొన్నాయి. ప్రజలంతా ఆనందసాగరాలలో ఓలలాడారు. ‘కొండదేవరే’ పసిపాపగా వచ్చినట్లు భావించారు. పులులు, సింహాల మీద స్వారీ చేసే ఈ పసిపాప, పసిపిల్లలు లేనివారికి పిల్లలు పుడతారని అభయమిచ్చేది. సుదీర్ఘ రోగాలతో బాధపడుతున్నవారికి రోగ నివారణ చేసేది.

sammakka sarakka jatara

యుక్తవయస్కురాలైన సమ్మక్క మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహం చేసుకుంది. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కూతుళ్లు, జంపన్న అనే కుమారుడు కలిగారు. కాకతీయ ప్రభువైన మొదటి ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పొలవాసపై దండెత్తారు. మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పగిడిద్ద రాజును అణచి వేయడానికి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తిన

కాకతీయుల శక్తికి మేడరాజు, పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. అవమానంతో జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాటినుంచి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.

భర్త, కుమారుడు మరణించిన వార్త విన్న సమ్మక్క ధైర్యం కోల్పోక, యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడి, కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టింది. గెలుపు తథ్యమనుకున్న కాకతీయులు, సమ్మక్క చూపిన దివ్యత్వానికి ఆశ్చర్యపోయారు. ఆ తరుణంలో శత్రువు వెనుక నుంచి వచ్చి బల్లెంతో పొడిచాడు. ఆమె రక్తం ఒక్క బొట్టు పడినా ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుంది. ఆ కారణంగా ఆమె గాయానికి కట్టు కట్టుకుని, శత్రువును హతమార్చింది. యుద్ధభూమి విడిచి మేడారానికి తూర్పు దిశగా చిలుకలగుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. గిరిజనులు సమ్మక్క కోసం అడివంతా గాలించారు. నాగవృక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల ఒక కుంకుమభరిణ కనిపించింది. దానినే సమ్మక్కగా భావించి ఆ ప్రాంతంలో రెండేళ్ళకొకసారి మాఘశుద్ధ పౌర్ణమినాడు జాతర చేసుకుంటున్నారు. అంతటి చరిత్ర ఉన్న ఆ వనంలోకి ప్రవేశించగానే మధురానుభూతి కలుగుతుంది.

జాతర విశేషాలు :

జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె వద్దకు తీసుకువస్తారు. రెండోరోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పారవశ్యంతో ఊగిపోతారు. మూడోరోజున భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. నాలుగో రోజు సాయంత్రం ఉద్వాసన పలికి దేవతలనిద్దరినీ యధాస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా | వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, పగిడిద్దరాజు పూజారి, గోవిందరాజు పూజారి… ఇలా ఈ దేవతలందరికీ విడివిడిగా ఉన్న పూజారులు వారి వారి కర్తవ్యాలను యధావిధిగా నిర్వర్తిస్తారు.

గద్దెనెక్కే తరుణం :

సమ్మక్క అదృశ్యమైన ప్రాంతంలో ఉన్న నాగవృక్షాన్ని అక్కడి తండా నాయకులు కొట్టివేసి గద్దె తయారు చేశారు. ఆమె కుమార్తె సారలమ్మకు మరో గద్దె ఏర్పాటు చేశారు. జంపన్న ఇంకా అక్కడే ఉన్నట్టుగా భావించే సంపెంగవాగును కూడా పూజిస్తారు. ఇప్పచెట్టు దగ్గర కలుగులో పామును దర్శిస్తారు. ఆ పుట్ట సమ్మక్క గద్దెకు పక్కగా ఉన్న కారణంగా దానిని సమ్మక్క భర్త పగిడిద్దరాజుదిగా భావిస్తారు.

జంపన్న వాగులో పవిత్రస్నానం చేసి, పాపాలు తొలగినట్టు భావిస్తారు. జంపన్న వాగు వరంగల్ నుంచి సుమారు 90 కి. మీ. దూరంలో ఉంది.

also read :

Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Eiffel Tower : ఈఫిల్‌ టవర్‌ చరిత్ర , విశేషాలు తెలుసుకోండి

moral stories in telugu : మాట తప్పని ఆవు.. కథ చదవండి

 

Exit mobile version