బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో మద్దతుదారులు,అభిమానులు బ్రెజిల్ లో విధ్వంసం సృష్టించారు.తమ అభిమాన నేత ఓటమిని జీర్ణించుకోలేక రోడ్లపైన, ప్రభుత్వ స్థలాలలో అల్లర్లు రేపారు. దీంతో విధ్వంసానికి కారణమైన దాదాపుగా 200 మందిని బ్రెజిల్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో,లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా ఇరువురు పోటీ పడగా బోల్సొనారో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు లులా డసిల్వా కొన్ని రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బోల్సొనారో ఓడిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని మద్దతుదారులు, అభిమానులు బ్రెజిల్ ప్రభుత్వంపై తిరగబడ్డారు.రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు.
దేశంలోని అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలైన సుప్రీంకోర్టు,అధ్యక్ష భవనం,కాంగ్రెస్ భవనాలలోకి చొరబడ్డారు. సెక్యూరిటీ వలయాలను ఛేదించుకుంటూ బారికేడ్లను తొలగించుకుంటూ పెద్దయెత్తున భవనాల్లోకి ప్రవేశించారు. భవనాల పైకప్పుల పైకెక్కి విధ్వంసానికి పాల్పడ్డారు. కిటికీలు, తలుపులతో పాటు లోపల ఉన్న సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు.
అధ్యక్షుడు బోల్సొనారోని తిరిగి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని,లేదా ప్రస్తుత అధ్యక్షుడు లులాను పదవి నుంచి దించేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
దీంతో విధ్వంసాన్ని ఆపడానికి మిలటరీ వాళ్లు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అణచివేయడానికి పెద్దయెత్తన టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సాయంత్రానికి ఆందోళనకారుల ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకుని, 200 మందిని అరెస్ట్ చేశారు.
గందరగోళ వాతావరణం కొంచెం కుదుట పడిన తరువాత బ్రెజిల్ న్యాయ శాఖ మంత్రి ఫ్లావియో డినో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
రెండేళ్ల క్రితం జనవరి 6న అమెరికాలో కూడా ఇదే తరహా విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయని, అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ విజయం సాధించడాన్ని తట్టుకోలేని మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు కూడా ఇదే విధంగా దేశంలో విధ్వంస చర్యలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు.
అయితే ఇక్కడ జరిగిన ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యం కూడా కొంత ఉందని,దానిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా నిన్న రాత్రి బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. . కడుపు నొప్పితో బాధపడుతున్న బోల్సోనారోను హాస్పిటల్ లో చేర్పించినట్లు ఆయన భార్య మిచ్చెల్లె బోల్సోనారో తెలిపారు. ప్రస్తుతం జైర్ ఫ్లోరిడాలోని అడ్వెంట్ హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు బ్రెజిల్ న్యూస్ పేపర్ ఓ గ్లోబో తెలిపింది.
also read: