Weather Today : హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఈరోజు వాతావరణంపై కీలక సూచనలు చేశారు. రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉంది. నేడు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, అక్కడక్కడా వడగండ్లు పడే వీలుందని అంచనా వేశారు.
రాష్ట్రంలోని కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉంది.
మరోవైపు హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి కనిపిస్తుంది. తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 91 శాతం నమోదైంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఇవాళ వర్షం పడే చాన్స్ ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE