Telugu Flash News

wasim akram: జైషా నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టిన వ‌సీం అక్ర‌మ్..!

wasim akram: వచ్చే ఏడాది ఆసియా కప్ క్రికెట్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు, 2023 ఆసియా కప్ తటస్థ వేదికలో జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈ ప్రకటనపై పాక్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో గానీ, టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాక్‌ క్రికెట్‌ బోర్డుతో ఎలాంటి చర్చ లేకుండా, దాంతో కలిగే దీర్ఘకాలిక పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా జైషా ఇలాంటి నిర్ణ‌యం ఎలా తీసుకున్నాడంటూ పీసీబీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక షాహిది ఆఫ్రిది,ప‌లువురు పాక్ ఆట‌గాళ్లు జై షా నిర్ణ‌యాన్ని త‌ప్పుడు ప‌డుతూ సోష‌ల్ మీడియాలో ప‌లు ట్వీట్స్ చేశారు.

వసీం అక్రమ్ (wasim akram) స్పంద‌న‌..

తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా జైషా నిర్ణ‌యంపై నిరాశను వ్యక్తం చేశాడు. జైషా.. పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాను సంప్ర‌దించి,దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) సమావేశం నిర్వహించాల్సి ఉందని అక్రమ్ అన్నారు.

మా క్రికెట్ బోర్డు అద్భుతమైన ప్రకటన ఇచ్చింది. పాకిస్తాన్ జ‌ట్టు ఎలా ఆడుతుందనేది భారతదేశం నిర్దేశించదు మరియు 10-15 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ తిరిగి హోస్ట్ చేస్తుంది.

రాజ‌కీయంగా ఏం జ‌రిగింద‌నేది నాకు తెలియ‌దు. జైషా ఏదైన చెప్పాలని అనుకుంటే క‌నీసం చైర్మ‌న్‌కి ఫోన్ చేసి, క్రికెట్ కౌన్సిల్‌తో స‌మావేశం జ‌రిపి త‌ర్వాత త‌న ఆలోచ‌న చెప్పాల్సింది అని వ‌సీం అక్ర‌మ్ అన్నారు.

కాగా, భారత్‌, పాకిస్థాన్‌లు తొమ్మిదేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. ఈ రెండు జట్ల మధ్య చివరిగా 2012 డిసెంబర్‌లో టీ20, వన్డే సిరీస్‌లు జరిగాయి. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేయగా, వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇక 2007-08 సీజన్ నుంచి టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు పోటీ పడింది లేదు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌లో పర్యటించ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు.

నియంత్రణ రేఖపై నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత రెండు దేశాల మ‌ధ్య వైరం ఎక్కువైంది. ఈ రెండు జ‌ట్లు కేవ‌లం ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి.

Exit mobile version