HomesportsIPL 2023: రికార్డుల వేటలో కింగ్‌ కోహ్లీ.. డివిలియర్స్, రోహిత్‌ను వెనక్కి నెట్టాడు

IPL 2023: రికార్డుల వేటలో కింగ్‌ కోహ్లీ.. డివిలియర్స్, రోహిత్‌ను వెనక్కి నెట్టాడు

Telugu Flash News

ఐపీఎల్ 2023 (IPL 2023) లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (royal challengers bangalore) జట్టు తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారైనా కప్‌ను గెలవాలన్న సంకల్పం నెరవేరుతుందేమోనని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రతి సారీ ఈ సాలా కప్‌ నమ్‌దే అంటూ చెప్పుకొనే ఫ్యాన్స్‌.. ఈసారి నిజంగా తమ జట్టు కప్పు గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ (mumbai indians) తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ (RCB) అదరగొట్టి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై నిర్దేశించిన 172 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఛేదించింది. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ (virat kohli) మరోసారి ఛేజ్‌ మాస్టర్‌ అవతారం ఎత్తి ఆర్సీబీ తొలి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

49 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లీ.. 82 పరుగులతో చివరిదాకా పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీకి తోడు కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా అర్ధ శతకంతో రాణించాడు. 43 బంతులాడిన ఫాఫ్‌.. 73 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం.

దీంతో ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ తన విజయాన్ని అందుకుంది. వన్‌డౌన్‌లో వచ్చిన దినేష్ కార్తీక్‌ నిరాశపర్చగా.. ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మాక్స్ వెల్‌ రెండు సిక్సర్లు బాది మెప్పించాడు. ఇటీవలే తన ఫామ్‌ను తిరిగి అందుకున్న కోహ్లీ.. ఇక ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున తొలి మ్యాచ్‌లోనే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 82 పరుగుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

కోహ్లీ రికార్డులు

ఈ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్‌ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. మరోవైపు ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకు 45 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. 5 ఐపీఎల్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. మొత్తంగా 50 సార్లకుపైగా అర్ధ శతకాలు చేశాడు. ఈ జాబితాలో ఆసీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ టాప్‌లో ఉన్నాడు.

వార్నర్‌ ఐపీఎల్‌లో 60 సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఇక శిఖర్‌ ధావన్‌ 49 సార్లు, ఏబీ డివిలియర్స్ 43 సార్లు 50కి పైగా పరుగులు చేసి మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. మరోవైపు రోహిత్‌ శర్మ 41 సార్లు 50 ప్లస్‌ పరుగులు చేయడం ద్వారా ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీ ఓపెనర్‌గా మూడు వేల పరుగుల మార్క్‌ను విరాట్‌ కోహ్లీ అందుకున్నాడు.

-Advertisement-

ఇప్పటి దాకా 224 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 6,706 రన్స్‌ చేశాడు. 45 ఫిఫ్టీలు, 5 సెంచరీలున్నాయి. ఇక ఈ సీజన్‌లో ప్రారంభంలోనే చెలరేగిన కోహ్లీ.. తదుపరి మ్యాచ్‌లలో ఇంకెన్ని పరుగులు రాబడతాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

also read:

Samantha : స‌మంతని పెళ్లి కుమార్తెగా చూసే స‌రికి నాకు ఏడుపాగలేదు: శోభిత ధూళిపాళ్ల‌

Marlene Schiappa : వివాదాల్లో ఫ్రాన్స్‌ మహిళా మంత్రి.. ప్లేబాయ్‌ పత్రికపై పోజులు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News