Viral Video : చాలా మంది ఇతరులకు ఏదైనా దానం చేయాలన్నా, ఏదైనా వస్తువు ఇవ్వాలన్ని ఇష్ట పడరు. సాయం చేయడానికి ఎన్నో సాకులు వెతుక్కుంటూ ఉంటారు. అయితే, ఇచ్చే గుణం మనసులో ఉంటే చాలు.. అని ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. ఇదే కోవలో చాలా మంది పేద వాళ్లు, మనుషుల నుంచి జంతువుల దాకా ఎన్నో ఘటనలు నిరూపించాయి. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
డబ్బు బాగా ఉన్నప్పటికీ దానాల విషయానికి వచ్చేసరికి కొందరు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటారు. వైరల్ అయిన ఈ వీడియోలో ఓ గుర్రం పావురాలపై అమితమైన ప్రేమను వ్యక్తపరిచింది. వీడియోలో గుర్రం చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా మంది భోజనం చేస్తున్న సమయంలో ఇతరులు మన కంచంలో చేయి పెడితే విసుక్కుంటూ ఉంటారు. కొందరు తిట్టేస్తుంటారు.
ఇక ఇంటి బయట బిచ్చగాళ్లు అన్నం పెట్టాలని అడిగితే కూడా విసుక్కొనే వారు చాలా మందే ఉంటారు. ఇతరులకు దానం చేయడం విషయంలో చాలా మంది ఇలా రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. ఇక్కడ ఓ గుర్రం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. గుర్రానికి పెట్టిన దాణాను తింటుండగా పావురాల గుంపు ఆ గుర్రం వద్దకు చేరుకుంది. గుర్రం ఏమంటుందో అని భయంతో అక్కడ పడిన గింజలను పావురాలు తినసాగాయి.
సాధారణంగా జంతువులు తాము తింటున్న ఆహారం వైపు ఇతర పక్షులు వస్తే వాటిని అరిచి తరిమేస్తాయి. కానీ ఈ గుర్రం అలా చేయలేదు. పావురాలు వచ్చి తింటుండగా.. కింద పడిపోయిన గింజలు వాటికి సరిపోతాయో లేదో అని నోటితో దాణాను కరుచుకొని కింద పడవేస్తూ ఆకట్టుకుంది.
పావురాలు కూడా బెదిరిపోకుండా హాయిగా గింజలను తిన్నాయి. గుర్రం తాను తినడమే కాక ఆ పావురాలకు కూడా తన ఆహారాన్ని పంచుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The Figen అనే ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను షేర్ చేశారు. మనుషులకంటే జంతువులే బెటర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Awwww I want to cry! How beautiful moment! 💞💞pic.twitter.com/iiuRc2AhtO
— The Figen (@TheFigen_) March 19, 2023