Telugu Flash News

Viral Video : పరమశివుడికి రోజూ 108 ప్రదక్షిణలు చేస్తున్న వృషభం.. నందీశ్వరుడి భక్తిపారవశ్యం అంటూ కామెంట్లు..

viral videos

Viral Video : సృష్టికి లయకారకుడైన ఈశ్వరుడికి రోజూ 108 ప్రదక్షిణలు చేస్తోంది ఓ ఎద్దు. నందీశ్వరుడి నిజమైన భక్తికి ఇది నిదర్శనమంటూ భక్తులు మెచ్చుకుంటున్నారు. పరమేశ్వరుడి సన్నిధిలో ఓ ఎద్దు ఇలా రోజూ ప్రదక్షిణలు చేయడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి ఎద్దు అంటే నందీశ్వరుడిగా హిందువులు కొలుస్తారు. పరమేశ్వరుడి వాహనం నంది. శివుడికి ద్వారపాలకుడిగా నందిని పిలుస్తారు. తాజాగా ఎద్దు శివాలయంలో రోజూ ప్రదక్షిణలు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది నిజమైన నంది అంటూ భక్తులు పిలుస్తున్నారు. పశుపక్ష్యాదుల్లోనూ భక్తి భావం ఉందని పురాణాల్లో పెద్దలు చెప్పినట్లుగా ఈ ఎద్దు రుజువు చేస్తోందంటున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. అక్కడి ఓ శివాలయంలో రోజూ నిర్ణీత సమయానికి వచ్చి ఈ ఎద్దు గుడి చుట్టూ సరిగ్గా 108 ప్రదక్షిణలు చేస్తుండడం విశేషం. ఇలా తన ప్రదక్షిణలు లెక్క వేసుకొని మరీ తిరుగుతోందని భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

మనుషులు కూడా 108 ప్రదక్షిణలు చేయాలంటే కాగితం, కలం చేత పట్టుకొని కౌంట్‌ వేసుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేస్తున్న క్రమంలో ఈశ్వరుడి నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే, ఎద్దు కచ్చితంగా లెక్కపెట్టుకున్నట్లుగా ప్రదక్షిణలు చేయడం గమనార్హం. అసలు కచ్చితంగా 108 ప్రదక్షిణలే ఎలా చేస్తోందో అర్థం కావడం లేదని భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

ఈ దృశ్యాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అనతికాలంలోనే ఈ వీడియో వైరల్‌ అయ్యింది. గుడి చుట్టూ కచ్చితంగా భక్తి భావంతో ఎద్దు ప్రదక్షిణలు చేస్తుండటం గమనించవచ్చు. అయితే, ఎద్దు తిరుగుతున్న క్రమంలో పలువురు మహిళలు కూడా శివయ్యను దర్శించుకున్నారు. అయితే, వీరెవరినీ పట్టించుకోకుండా ఎద్దు తన పని తాను చేసుకుంది. అయితే, ఈ వీడియో పాతదని తెలుస్తోంది. ఎప్పటిదో అయినా తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఎద్దు నిజమైన నంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version