Telugu Flash News

victoria gowri : జస్టిస్‌ LCV గౌరి నియామకంపై దుమారం.. ఎందుకు ?

VictoriaGowri

మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ (Lakshmana Chandra Victoria Gowri) వ్యవహారంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమెను మద్రాసు హైకోర్టు (Madras high court) అదనపు న్యాయమూర్తిగా నియమించడంపై నిరసనలు మిన్నంటాయి.

ఈ వ్యవహారాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, సోమవారం వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (supreme court) .. పిటిషన్లను కొట్టేస్తూ నిర్ణయం వెలువరించింది. సరైన కారణాలు లేకుండా ఈ పిటిషన్‌ను స్వీకరించబోమని స్పష్టం చేసింది.

ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే, సుప్రీంలో ఈ కేసులో అటు సుప్రీంలో విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఉదయం హైకోర్టు న్యాయమూర్తిగా గౌరీ ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనం విచారణ చేసే కేసుల్లో లాయర్‌ గౌరీ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అయితే, ఆమెకు బీజేపీతో సత్సంబంధాలున్నాయని విమర్శలు ఉన్నాయి.

దాంతోపాటు క్రైస్తవులను, ముస్లింలను కించపరుస్తూ విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆమెను సిఫార్సు చేయడంపై అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్‌ వేశారు. అనంతరం సోమవారం అత్యవసర విచారణకు రాగా.. వీటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు గౌరీ అర్హతలకు సంబంధించినవి కాదని న్యాయస్థానం పేర్కొంది. ఆమె అర్హతలను సవాల్‌ చేయవచ్చని, కానీ అనుకూలతల విషయంపై కోర్టు జోక్యం చేసుకోజాలదని స్పష్టం చేసింది. రాజకీయాలకు సంబంధించిన అంశాలన్నీ పరిశీలించాకే కొలీజియం ఆమె పేరును సిఫార్సు చేసిందని కోర్టు స్పష్టం చేసింది. దాంతోపాటు ఆమెను అదనపు న్యాయమూర్తిగా నియమించారని గుర్తు చేసింది.

అదనపు న్యాయమూర్తిగా ఆమె సరైన పనితీరు కనబర్చకపోతే.. అలాంటి సందర్భాల్లో వారిని శాశ్వత జడ్జీలుగా నియమించని సందర్భాలు చాలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఆమె జడ్జిగా ప్రమాణ స్వీకారం చేయనిదే తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే, గౌరీ అర్హతల వివాదంపై సుప్రీంలో వాదనలు, విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఆమె మద్రాసు హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా ప్రమాణం చేయడం గమనార్హం. అలహాబాద్‌, కర్ణాటక, మద్రాసు హైకోర్టులకు 11 మంది లాయర్లను జడ్జీలుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

also read:

Telangana : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఏపీ అప్పులు ప్రకటించిన కేంద్రం.. ఏటా ఎన్ని వేల కోట్లంటే!

Exit mobile version