ప్రతిపక్ష నేతల ఫోన్లు ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సహా టీడీపీ ముఖ్య నేతల ఫోన్లను వైసీపీ సర్కార్ ట్యాపింగ్ చేస్తోందని మూడేళ్లుగా తాము చెబుతూనే ఉన్నామన్నారు.
ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వయంగా తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారని, దీనికి ముఖ్యమంత్రి జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సమాధానం చెప్పి తీరాలన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నడూ ఇలా ఫోన్లు ట్యాప్ చేయలేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు. అయితే, పెగాసస్ అంటూ వైసీపీ ప్రభుత్వం కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అసలు ప్రతిపక్ష నేతలు ఫోన్లు మాట్లాడుకొనే స్వేచ్ఛ కూడా లేకుండా ట్యాపింగ్‌చేసే హక్కు మీకెవరిచ్చారని ప్రభుత్వంపై వర్ల రామయ్య నిప్పులు చెరిగారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని, దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని వర్ల రామయ్య ప్రశ్నించారు.
8 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కోటంరెడ్డి వాపోయారని వర్ల తెలిపారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు ఇలాంటివి చేస్తారుగానీ వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా తన ఫోన్ ట్యాప్ చేయడం ఏంటని కోటంరెడ్డి ప్రశ్నించారని వర్ల రామయ్య గుర్తు చేశారు. ఇప్పటికే 11 సిమ్‌లు మార్చానని కోటంరెడ్డి చెప్పడం ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌కు నిదర్శనమన్నారు.
ఇది ఆషామాషీ విషయం కాదని వర్ల రామయ్య పేర్కొన్నారు. అసలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మీకెందుకని వర్ల రామయ్య ప్రశ్నించారు.
మొదట ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయాలన్నారు. సీఎం ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు? అధికారిక పని మీదనా? లేక రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకా? దౌత్యవేత్తలతో మాట్లాడానికా? అని ప్రశ్నించారు.
ఈ పనులేవీ కాదని, స్వప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వర్ల ఆరోపించారు. ఫోన్లు ట్యాపింగ్ చేసినందుకు ముఖ్యమంత్రి పాలించే అర్హత కోల్పోయారని, ఆయన పదవికి రాజీనామా చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
also read :
Novak Djokovic : జకోవిచ్.. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచి నిలిచాడు!