Telugu Flash News

USA News : అమెరికాలో మరోసారి స్కూల్‌లో కాల్పుల ఘటన

iowa-school-shooting

USA News : అమెరికాలో మరోసారి స్కూల్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయోవా రాష్ట్రంలోని పెర్రీ నగరంలోని ఓ స్కూల్‌లో గురువారం ఉదయం 17 ఏళ్ల టీనేజర్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. గాయపడ్డవారిలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్, నలుగురు చిన్నారులు ఉన్నారు.

నిందితుడు తనని తాను కాల్చుకుని మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఓ ఐఈడీ బాంబు కూడా దొరికింది.

కాల్పుల సమయంలో స్కూల్‌లోనే ఉన్న ఓ విద్యార్థిని ఎవా ఆ భయానక అనుభవాన్ని మీడియాకు చెప్పింది. కాల్పుల శబ్దం వినగానే తాను తరగతిలోకి వెళ్లి దాక్కున్నట్టు చెప్పింది. తరువాత బయటకు వచ్చి చూస్తే అక్కడంతా పగిలిన గాజు ముక్కలు, రక్తం మరకలు కనిపించాయని పేర్కొంది.

శీతాకాలం సెలవుల తరువాత స్కూల్‌ మొదలైన తొలి రోజునే ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో శుక్రవారం స్కూల్‌కు సెలవు ప్రకటించారు.

వర్జీనియా రాష్ట్రంలోనూ ఇటీవల కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్‌ వద్ద 15 ఏళ్ల కుర్రాడు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపాడు. ఎడ్యుకేషన్ వీక్ కథనం ప్రకారం, అమెరికా 2018 నుంచి ఇప్పటివరకూ స్కూల్‌లల్లో 182 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి.

ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి?

Exit mobile version