Union Budget 2023 Live Updates :
ఆదాయపు పన్ను పరిమితి రూ.7 లక్షలకు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఉద్యోగులకు ఊరటనిస్తూ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
- రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15% పన్ను
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20% పన్ను
- రూ.15. లక్షలు దాటిన వారికి 30% పన్ను వర్తిస్తుంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పరిమితి పెంపు
సీనియర్ సిటిజన్ల పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితిని పెంచుతున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ.15 లక్షల పరిమితిని రెట్టింపు చేసి రూ.30 లక్షలకు పెంచుతామన్నారు.
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ సుంకం పెంపు
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆయా లోహాల ధరలు పెరగనున్నాయి. అలాగే టైర్లు, సిగరెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు టీవీలు, మొబైల్స్, కిచెన్ చిమ్నీలు, కెమెరాలు, లెన్స్‌లు, దిగుమతి చేసుకున్న బంగారం ధరలు తగ్గనున్నాయి.
మరో 50 విమానాశ్రయాలు..
ప్రాంతీయ వాయు కనెక్టివిటీ కోసం 50 అదనపు విమానాశ్రయాలు, వాటర్ ఏరోడ్రోమ్‌లు, ల్యాండింగ్ గ్రౌండ్‌లను పునరుద్ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది UDAAN పథకంతో ప్రారంభమైన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్‌కు అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తుందని నిర్మల వెల్లడించారు.
మహిళల కోసం కొత్త పథకం
ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం రెండేళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీని కలిగి ఉంటుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
వాహనాల తుక్కుకు మరిన్ని నిధులు..
ఎనర్జీ ట్రాన్స్మిషన్ కోసం 38 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం తెచ్చామన్నారు. వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధులు కేటాయించామన్నారు. తీర ప్రాంతాల రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు నిర్మల.
రవాణా ప్రాజెక్టులకు 75 వేల కోట్లు..
రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం మిషన్ కర్మయోగి ప్రవేశపెడుతున్నామన్నారు. కృత్రిమ మేథ అభివృద్ధికి 3 సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాగు, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల కోసం కృత్రిమ మేథ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు ఉంటుందన్నారు.
ఇల్లు కట్టుకొనే వారికి గుడ్ న్యూస్..
కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి మోదీ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్‌లో నిధులు పెంచినట్లు నిర్మల వెల్లడించారు. గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79 వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశంగా కనిపిస్తోంది.
ఎంఎస్‌ఎంఈలకు రిఫండ్ స్కీమ్..
కోవిడ్ సమయంలో నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు రిఫండ్ పథకం తెచ్చామన్నారు. నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ద్వారా సులభతరమైన కేవైసీ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ-కోర్టుల ప్రాజెక్టుకు 7 వేల కోట్లు కేటాయింపులు జరిపామన్నారు. 5జీ సర్వీసుల కోసం 100 ల్యాబులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌కార్డు ద్వారానే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డిజి లింక్ ఉంటుందన్నారు.
10వేల కోట్లతో గిరిజన మిషన్..
గిరిజన మిషన్ కోసం 10 వేల కోట్ల కేటాయింపులు చేశామన్నారు. 50 ఎయిర్ పోర్టులు, పోర్టుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. ట్రాన్స్‌పోర్టు రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్మల తెలిపారు. నగరాల్లో మౌలిక సదుపాయాల కోసం అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్ నెలకొల్పామన్నారు. ఏడాదికి అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్ 10 వేలకోట్లని నిర్మల తెలిపారు. 75 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రాలకు 13.7 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు రాబోతున్నాయని నిర్మల వెల్లడించారు.
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు కొనసాగింపు..
3.5 లక్షల గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని నిర్మల తెలిపారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి 79 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కరువు ప్రాంతాల రైతులకు 5,300 కోట్లు ప్రత్యేకంగా కేటాయింపులు చేశామన్నారు. దళితుల అభివృద్ధికి ప్రత్యేక స్కీమ్‌లు రూపకల్పన చేశామన్నారు. ఏకలవ్య స్కూళ్లలో 38,800 మంది ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. మరోవైపు రైల్వేలకు 2.40 లక్షల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు నిర్మలమ్మ.
ఆదివాసీలకు చేయూత..
ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు నిర్మల తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం 15 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. డిజిటల్ ఎఫిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కారాగారాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థికసాయం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
మరిన్ని నర్సింగ్ కాలేజీల స్థాపన..
2014 నుంచి దేశ వ్యాప్తంగా 150కి పైగా వైద్య కాలేజీలకు అనుమతులు మంజూరు చేశామన్నారు నిర్మల. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల సంఖ్యను పెంచుతామన్నారు. ఫార్మా రంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. వైద్య కాలేజీల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యా విధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తామన్నారు.
2047 లక్ష్యంగా..
2047 లక్ష్యంగా పథకాల రూపకల్పన చేస్తున్నట్లు నిర్మలమ్మ స్పష్టం చేశారు. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాలకు డిజిటలైజేషన్ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల పంపిణీ ఉంటుందన్నారు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‌కు 2 వేల కోట్లు కేటాయించామన్నారు.
వ్యవసాయంలో ఏడు అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం..
సప్త రుషుల రీతిలో బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. ఇందులో వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత ఇస్తూ ప్రత్యేక నిధి ఇస్తున్నామన్నారు. దేశంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పత్తిసాగు మెరుగుదలకు చర్యలు చేపట్టామన్నారు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం ఉంటుందన్నారు.
ఆత్మనిర్భర్ కింద భారత్ క్లీన్ పథకం ఉద్యానవన పంటలకు చేయూతనిచ్చేలా చేస్తామన్నారు. చిరుధాన్యాల పంటలకు సహకారం అందించేందుకు శ్రీఅన్న పథకం తెస్తామన్నారు. రాగులు, జొన్నలు, సజ్జలు ఇతర పంటలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు.
అభివృద్ధి కోసం భారీగా నిధులు
అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నట్లు నిర్మల గుడ్ న్యూస్ చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించామన్నారు. మత్స్యాశాఖకు 6 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. చిరుధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. 91 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉద్యాన పంటలకు చేయూత ఉంటుందన్నారు.
అమృతకాలంలో ఇది తొలి బడ్జెట్
మనదేశం తలెత్తుకొని నిలబడుతోందని నిర్మల తెలిపారు. అమృతకాలంలో ఇది తొలి బడ్జెట్‌గా అభివర్ణించారు. స్వచ్ఛ భారత్‌లో భాగగంగా 11.7 కోట్ల రూపాయలతో టాయ్‌లెట్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 220 కోట్ల రూపాయలతో కోవిడ్ వ్యాక్సిన్లు అందించినట్లు తెలిపారు. 44 కోట్ల మందికి పీఎం సురక్ష బీమా యోజన పథకం అందుతోందన్నారు. విశ్వకర్మ కౌశల్ పథకం కింద చేనేత కార్మికులకు సాయం అందిస్తున్నామన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2 లక్షల కోట్లను కేంద్రం కేటాయించినట్లు వివరించారు.
ఆత్మ నిర్భర్ భారత్‌లో చేనేత వర్గాలకు లబ్ధి చేకూరిందని నిర్మల పేర్కొన్నారు. మహిళా సాధికారత దిశగా కేంద్రం కృషి చేస్తోందన్నారు. బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలిసారి ప్రాధాన్యత కల్పించిందన్నారు. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు తెచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు.
కరోనా వేళ పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేశామని నిర్మల లోక్‌సభలో వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఇది కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు.
తలసరి ఆదాయం రెట్టింపు
భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నిర్మల పేర్కొన్నారు. దేశంలో గత తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని తెలిపారు. అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు మనదేశం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. భారత్‌లో డిజిటిల్ యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగిపోయాయని నిర్మల వెల్లడించారు. ఈపీఎఫ్‌వోలో సభ్యుల సంఖ్య డబుల్ అయ్యిందని స్పష్టం చేశారు.
భారత్ దూసుకుపోతోంది
యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఈ బడ్జెట్ ఆశాదీపమని నిర్మల పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని నిర్మల చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా అభివృద్ధి మందగించిందన్నారు. అయితే, భారత్ మాత్రం దూసుకుపోతోందని నిర్మలమ్మ చెప్పారు. ఇదివరకు బడ్జెట్‌లు నిర్మించిన పునాదులపైనే ప్రస్తుత బడ్జెట్ సమర్పిస్తున్నట్లు నిర్మల స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
దేశం వృద్ధి రేటు శరవేగంగా పెరుగుతోందని నిర్మలాసీతారామన్ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయని పార్లమెంటు వేదికగా నిర్మల స్పష్టం చేశారు. ప్రపంచ సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ధీటుగా ఎదుర్కొని నిలబడిందని నిర్మల గుర్తు చేశారు. జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించిందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మల వ్యాఖ్యానించారు.
బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చివరి బడ్జెట్ ప్రశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక మంత్రిగా నిర్మల ఐదో బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల సందర్భంగా ఓపెన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు ఈ సారి కూడా గత రెండేళ్ల మాదిరిగానే కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
BUDGET UPDATES LIVE: ప్రారంభమైన కేబినెట్ భేటీ
2023-24కు సంబంధించిన కేంద్ర వార్షిక బడ్జెట్ నేడు పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు పెడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మరికాసేపట్లో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
Also Read :
Naga Babu: పెళ్లయ్యాక వరుణ్ తేజ్‌ని దూరం పెడతానన్న నాగబాబు.. ఎందుకిలా?
Viral Video today : పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన వధువు.. నెట్టింట వీడియో వైరల్!