China spy balloon : అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీల మధ్య యుద్ధానికి దారి తీసే పరిస్థితులు నెలకొంటున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా యూఎస్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఇండో పసిఫిక్‌లో డ్రాగన్ కంట్రీ దుశ్చర్యలు, తైవాన్ విషయంలో చైనా తీరుపై పెద్దన్న మరింత ఆగ్రహంగా ఉంది. ఇలాంటి తరుణంలోనే ఇరు దేశాల నడుమ యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయంటూ సీనియర్ అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇప్పటికే ఉప్పు నిప్పులా చిటపటలాడుతున్న చైనా-అమెరికా మధ్య ఇప్పుడు మరో వివాదం ఏర్పడింది. తాజాగా చైనాకు చెందిన నిఘా బెలూన్.. అమెరికా మీదుగా ఎగురుతోందని పెంటగాన్ సంచలన ప్రకటన చేసింది. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అత్యంత ముఖ్యమైన అణ్వాయుధ స్థావరాలు ఉన్న ప్రాంతం మీదుగా డ్రాగన్ కంట్రీకి చెందిన బెలూన్ చక్కర్లు కొడుతోందని యూఎస్ రక్షణ విభాగం నిర్ధారించింది.
అయితే, అమెరికా అధ్యక్షుడి సూచనతో ఆ బెలూన్‌ను కూల్చివేయాలని ప్రయత్నించి ఓ సీనియర్ అధికారి సూచనతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ బెలూన్‌ను పేల్చడం ద్వారా ప్రజల భద్రతకు భంగం వాటిల్లే ఆస్కారం ఉందని డిఫెన్స్ సెక్రటరీ ఆస్టిన్, సైనికాధికారులను హెచ్చరించడంతో ఈ పని విరమించుకున్నారు. వందలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. వాయువ్య ప్రాంతంలో ఎయిర్ బేస్‌లు, క్షిపణి వ్యవస్థలున్న సిలోస్ అండర్ గ్రౌండ్ మీదుగా ఈ నిఘా బెలూన్ సంచరిస్తోందని స్పష్టం చేశారు.
యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ హెడ్ జనరల్ మైక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 కల్లా యూఎస్-చైనా నడుమ యుద్ధం జరిగే ఆస్కారం ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే నిఘా బెలూన్ సంచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, చైనా గూఢచార బెలూన్ గమనం ప్రమాదకరమైనదేమీ కాదని, గూఢచర్యం కోసం పరిమితంగా ఉందని అంచనా వేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు చదవండి :
మృణాల్ ఠాకూర్ ఫోటోలు.. ఇంతందం దారి మళ్లిందా..
Surekha Vani: సురేఖా వాణి స్టెప్పులకి సోషల్ మీడియా షేక్..ఒకే చోట చేరిన లేడి యాక్టర్స్..!