సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేగుతోంది. ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వదని, టికెట్ ధరలను పెంచే అవకాశం లేదని స్పష్టం చేసింది. చారిత్రక, తెలంగాణ ఉద్యమం వంటి సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు పెంపు అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌ను కలవాలని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని మరో నిర్మాత నాగవంశీ తెలిపారు.
సినిమా రేట్లు పెంపు, ప్రీమియర్ షోలపై చర్చించాలని నిర్మాతలు భావిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన ఎవరికి మంచిది కాదని, సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందనే ప్రచారం అవాస్తవమని నాగవంశీ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షూటింగ్‌లు కొనసాగుతున్నాయని చెప్పారు.