Ind vs Aus: ఆస్ట్రేలియా- భారత్ మధ్య నేడు మూడో టీ 20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాన్ని నిర్ణయించే కీలక మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుండడంతో ఈ మ్యాచ్‌ని తిలకించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పక ఉంటుంది ఆ కాబట్టి ఆ మజాన్ని లైవ్‌లో వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు స్టేడియంకి పరుగులు పెడుతున్నారు.
అయితే స్టేడియం దగ్గర పోలీసులు సుమారు 2500 మంది బందోబస్తు కల్పిస్తున్నారు. 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు.
ఆంక్షలు పాటించాల్సిందే..
నేటి మ్యాచ్ చూడ్డానికి వెళ్లే వారికి సైతం రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. స్టేడియంలోనికి కొన్ని వస్తువులను అనుమతించబోమని ప్రకటించారు.
కెమెరాలు మరియు ఇతర రికార్డింగ్ సాధనాలు, ల్యాప్‌టాప్‌లు,సిగరెట్, లైటర్, అగ్గి పెట్టె, తుపాకులు, కత్తులు, ఇతర ఆయుధాలు, వాటర్ బాటిల్స్, మద్యం, ఇతర పానీయాలు, పెంపుడు జంతువులు, హెల్మెట్లు, పటాకులు, తినే పదార్థాలు, బ్యాక్‌ప్యాక్‌లు, సెల్ఫీ స్టిక్స్, మత్తు పదార్థాలు వంటి వాటిని అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు.
ఇక ఈ రోజు మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక ఆంక్షలు ఉండనున్నాయి.
ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై భారీ వాహనాలను అనుమతించరు.. తార్నాక మీదుగా వచ్చే వీఐపీ వాహనాలు హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ, ఏక్ మినార్ వద్ద కుడి వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకొని వాహనాలను ఏ, సీ ల వద్ద నిలపాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అంబర్ పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు దూరదర్శన్, రామాంతపూర్, స్ట్రీట్ నెంబర్ 8 వద్ద ఎడమ వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్ద దిగి వాహనాలను పార్కింగ్ ఏ, సీ ల వద్ద నిలపాలని సూచిస్తున్నారు. నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద ఎడమ వైపు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.