Telugu Flash News

Uttar Pradesh : ఇకపై మాఫియా బెదిరింపులకు చోటు లేదు.. యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు!

uttar pradesh cm yogi adityanath

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌తో పాటు అతడి సోదరుడు అష్రఫ్‌ల హత్య నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటన తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో గత పాలకుల హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా భ్రష్టుపట్టి ఉండేవని యోగి తెలిపారు.

అయితే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పుడు ఏ నేరస్తుడు, మాఫియా కూడా వ్యాపారవేత్తలను బెదిరించలేడని స్పష్టం చేశారు. లక్నో, హర్దోయీల్లో టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుపై ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం యోగి మాట్లాడుతూ.. గత పాలనలో ఉత్తరప్రదేశ్‌ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయి ఉండేదని, అయితే, ప్రస్తుతం నేరగాళ్లు, మాఫియాల ఉనికి కూడా ప్రశ్నార్థకమైందని వెల్లడించారు.

ఇంకా యోగి మాట్లాడుతూ.. 2017కు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిని ఉండేవన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా అల్లర్లు చూసేవాళ్లమన్నారు. దీంతో రాష్ట్రానికి అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 2012-17మధ్య కాలంలో 700కు పైగా దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు.

గత పాలనలోనూ 300కు పైగా అల్లర్లు జరిగాయన్న యోగి.. 2017 నుంచి ఇప్పటి వరకు ఒక్క అల్లర్ల ఘటన కూడా జరగలేదన్నారు. రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని వెల్లడించారు. అలాంటి పరిస్థితులే రాలేదని పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు ఇది సానుకూలతను చేకూర్చిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏ నేరస్తుడు, మాఫియా కూడా వ్యాపార వేత్తలను బెదిరించే అంత సీన్‌ లేదని, ఇప్పుడు రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో గణనీయమైన పురోగతి సాధించిందని ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. మరోవైపు అతీక్‌ అహ్మద్‌, ఆయన సోదరుడు అష్రఫ్‌లను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రయాగరాజ్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ముగ్గురు వ్యక్తులు మీడియా ముసుగులో వచ్చి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అంతకుముందే అతీక్‌ కొడుకు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

also read :

Karthikeya: అమ్మ‌కి పెళ్లి కాక‌ముందే రాజ‌మౌళిని నాన్న అని డిసైడ్ అయ్యా: కార్తికేయ‌

NTR 30: ఎన్టీఆర్ టీంలో జాయిన్ సైఫ్ అలీ ఖాన్.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

 

Exit mobile version